October 26, 2012

"ఇప్పటిదాకా మీరు పల్లకీలు మోశారు. ఇక పల్లకీ ఎక్కడం నేర్చుకోండి. మీలో ఐకమత్యం రావాలి. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి''

తాగునీటి కోసం ఎన్టీఆర్ సుజల
చంద్రబాబు ప్రకటన..
తిరుపతికి వెళ్లకుండానే గుండు
మధ్యతరగతి ఏం పాపం చేసింది?..
వాళ్లకెందుకు అదనపు సిలిండర్లు ఇవ్వరు?..
అధికారంలోకి వస్తే పది సిలిండర్లు ఇస్తాం..


టీడీపీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 'ఎన్టీఆర్ సుజల' పేరిట ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకాన్ని మహబూబ్‌నగర్ జిల్లా నుంచే ప్రారంభిస్తామన్నారు. ఈ పథకంతో రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మున్సిపాల్టీల్లో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

"నిత్యావసర ధరల పెరుగుదలతో జనం ఇప్పటికే సమస్యల సుడిలో చిక్కుకున్నారు. కేవలం దీపం లబ్ధిదారులకే అదనంగా మూడు సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించడం దారుణం. ఆ నిర్ణయంతో 25 శాతం మందికే లబ్ధి చేకూరుతుంది. మిగిలిన మధ్యతరగతి ప్రజలు ఏం పాపం చేశారు? వారికి ఎందుకు అదనపు సిలిండర్లు ఇవ్వరు? వెయ్యి రూపాయలు పెట్టి సిలిండర్ కొనే స్థోమత మధ్యతరగతి ప్రజలకు ఉంటుందా? పార్టీ అధ్యక్షురాలు చెప్పినా.. సీఎం కిరణ్ పట్టించుకోవడం లేదు'' అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే, ఇప్పటి రేటుకే ఏడాదికి 10 సిలిండర్లు ఇచ్చి తీరతామని స్పష్టం చేశారు.

బుధ, గురువారాల్లో అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ, గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండలాల్లో 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర కొనసాగింది. రెండురోజుల్లో 26.1 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వివిధ సభల్లో ఆయన మాట్లాడారు. "ఇప్పటికే నిత్యావసరాలను విపరీతంగా పెంచేశారు. గ్యాస్ సిలిండర్ ధర పెంచేశారు. ఒకదాని తర్వాత మరొకటిగా పన్నులతో బాదేస్తున్నారు. గుండు కోసం తిరుపతి వెళ్లాల్సిన అవసరం లేదు'' అని ఎద్దేవాచేశారు. పేదల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని, టీడీపీ అధికారంలోకి వస్తే, అన్ని వ్యాధులు కవరయ్యేలా కొత్త ఆరోగ్య శ్రీ పథకాన్ని చేపడతామని ప్రకటించారు.

ఇప్పుడు మీ వద్దకు వస్తున్నామని అంటున్న నాయకులు వైఎస్ ఉన్నప్పుడు ఎక్కడికెళ్లారంటూ జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. "ఇప్పటిదాకా మీరు పల్లకీలు మోశారు. ఇక పల్లకీ ఎక్కడం నేర్చుకోండి. మీలో ఐకమత్యం రావాలి. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి'' అని చంద్రబాబు, సగర, బోయ కులస్తులకు పిలుపునిచ్చారు. తమను ఎస్టీల్లో చేర్చాలని వారు కోరగా తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయిజ - బింగిదొడ్డి మధ్య బాబును చూసేందుకు జయమ్మ అనే యువతి చేనులోంచి పరుగెత్తుకు రాగా, ఆమెవెంట ఆమె పెంచుకుంటున్న పొట్టేలు కూడా పరుగెత్తుతూ వచ్చింది.

ఇది చూసిన బాబు.. తన యజమానురాలు వెళ్తుంటే ఆమె వెన్నంటే వెళ్లిన పొట్టేలుకు ఉన్న విశ్వాసం కూడా కొంతమంది నాయకులకు లేకుండా పోయిందని, ఆయారాం.. గయారాంలు ఎక్కువయ్యారని పార్టీ నుంచి బయటకు వెళ్లినవారిని ఉద్దేశించి మండిపడ్డారు. ఇప్పుడు కనీసం ఇళ్లు అయినా కనిపిస్తున్నాయని, వైసీపీ అధికారంలోకి వస్తే ఇళ్ల పైకప్పులు కూడా ఉండబోవని అన్నారు. బింగిదొడ్డి వద్ద గురువారం మధ్యాహ్నం చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఆర్టీసీ బస్సు అక్కడ నిలిచి ఉంది. దీంతో, "ఆర్టీసీ డ్రైవర్ గారూ.. నమస్కారం! అందరికీ చెప్పండి త్వరలోనే మంచి రోజులు వస్తాయని. ఆర్టీసీని మనమందరం కాపాడుకుందాం. ఉద్యోగులకు ప్రత్యేక విధానం కల్పిస్తాం. డ్రైవర్లు, కండక్టర్లకు న్యాయం చేస్తాం'' అని చెప్పారు.

అదే బస్సులోని ప్రయాణికులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ తల్లీ నమస్కారం! తమ్ముళ్లు బాగుతున్నారా! అంటూ పలకరించారు. పాదయాత్రలో భాగంగా జిన్నింగ్ మిల్లులో పని చేస్తున్న బాలికలతో ఆయన మాట్లాడారు. తనకు చదువుకోవాలని ఉందని, కానీ, ఆర్థిక ఇబ్బందులు సహకరించడం లేదని, తమకు తండ్రి లేడని, ముగ్గురమూ ఆడపిల్లలమేనని ఝాన్సీ అనే బాలిక చంద్రబాబుకు వివరించింది. చదివించేవారు లేక ఉన్నత చదువులు చదవలేకపోతున్నానని ఏడో తరగతి చదువుతున్న మహేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో, ఆ ఇద్దరినీ తాను చదివిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
No comments :

No comments :