October 26, 2012

"దేవుడి దయ వల్ల సురక్షితంగా ఉన్నాం. ఎవరికీ ఏమీ కాలేదు'' -చంద్రబాబు

మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణం! శుక్రవారం రాత్రి 9 గంటలు! చేనేత పరిరక్షణ సమితి నాయకులు పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు సన్మానం చేశారు! చంద్రబాబు ప్రసంగించారు! పరిరక్షణ సమితి నాయకులు కిందకి దిగి వెళుతున్నారు! అదే సమయంలో, టీడీపీలో చేరేందుకు కొంతమంది నాయకులు వేదికపైకి ఎక్కారు! అంతే.. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. అసలే అది చిన్న వేదిక. ఎక్కువమంది దానిపై ఎక్కడంతో నిట్టనిలువుగా పడిపోయింది.

దాంతో, చంద్రబాబు ఒక్కసారిగా కుడి వైపునకు కూలబడిపోయారు. వేదికపై ఉన్నవారు ఒకరిపై మరొకరు పడిపోగా.. చంద్రబాబుపైనా కొంతమంది పడిపోయారు. వేదిక కూలగానే, 'సార్‌ను చూసుకోండి.. సార్‌ను చూసుకోండి' అంటూ నాయకులు గన్‌మెన్‌లు ఒక్కసారిగా వేదిక వద్దకు పరుగెత్తారు. ఘటన జరిగిన వెంటనే తేరుకున్న బ్లాక్ క్యాట్ కమెండోలు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది చంద్రబాబును పైకి లేపారు. సురక్షితంగా కిందకు తీసుకు వచ్చారు.

అనూహ్యంగా ఘటన జరగడంతో చంద్రబాబు సహా నేతలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వేదికపై నుంచి కిందకు వచ్చిన తర్వాత చంద్రబాబు మాట్లాడారు. "దేవుడి దయ వల్ల సురక్షితంగా ఉన్నాం. ఎవరికీ ఏమీ కాలేదు'' అని అన్నారు. కార్యకర్తలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. దీంతో, పార్టీ కార్యకర్తలు బాణసంచా తీసుకువచ్చి కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం బాబు యథావిధిగా పాదయాత్రను తిరిగి ప్రారంభించారు.

ఒక కిలోమీటరు మేర పాదయాత్ర కొనసాగించారు. అయితే, వేదికతోపాటు చంద్రబాబు కూడా కుప్పకూలడం, ఆయనపై కొంతమంది పడిపోవడంతో ఆయన వెన్నెముకపై ఒత్తిడి పెరిగింది. కిలోమీటరు నడక కొనసాగించిన తర్వాత ఆ నొప్పి మరికాస్త ఎక్కువైంది. దీంతో, చంద్రబాబు పాదయాత్రను కొనసాగించలేకపోయారు. రాత్రి బసకు రెండు కిలోమీటర్లకు ముందే చంద్రబాబు పాదయాత్రను నిలిపి వేశారు. అక్కడే బస చేశారు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్యులను గద్వాలకు రప్పిస్తున్నారు. వారు వచ్చి చంద్రబాబును పరిశీలించనున్నారు.

వైద్యుల సలహా మేరకే పాదయాత్ర కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పోకల మనోహర్, గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ రమాదేవి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ వెంకట్రాంరెడ్డి తదితరులు స్వల్పంగా గాయపడ్డారు.
No comments :

No comments :