October 29, 2012

దారిలో రైతులను పలకరిస్తూ, వారి సమస్యలను వింటూ 28వ రోజు పాదయాత్ర సాగిందిలా..

పాదయాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం ఉదయం 10.40 నిమిషాలకు మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్ మండలం చిన్నపాడు స్టేజీ నుంచి నడక ప్రారంభించారు. దారిలో రైతులను పలకరిస్తూ, వారి సమస్యలను వింటూ ముందుకు సాగారు.

ధరూర్ మండలం పెద్దపాడు, ఎమినోనిపల్లి, చింతరేవుల గ్రామాలకు చెందిన రైతులు, కూలీలతో చంద్రబాబు మాట్లాడారు. ఎమినోనిపల్లి వద్ద పొలంలో పని చేస్తున్న కూలీలతో ముచ్చటించారు. చింతరేవుల గ్రామంలో రైతులు విద్యుత్, తాగునీరు, తదితర సమస్యలను మొరపెట్టుకున్నారు. పెద్దపాడు గ్రామానికి చెందిన ఆశన్నను చంద్రబాబు పలకరించారు.

చంద్రబాబు: ఎద్దులు ఎంతకు కొన్నావు?
ఆశన్న: రూ.50 వేలు సార్

చంద్రబాబు: పొలం పనులు చేయడానికి ట్రాక్టర్ కొనవచ్చుగా ...
ఆశన్న: పెరిగిన డీజీల్ ధరలకు ట్రాక్టర్ కొనాలంటేనే భయం వస్తోంది.

చంద్రబాబు: మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీజిల్, పెట్రోల్ ధరలపై తగ్గింపునకు కేంద్రంపై ఒత్తిడి తెస్తాం.
ఆ సమయంలో అక్కడే ఉన్న కూలీలు, రైతులు ఆయన చుట్టూ చేరారు.

చంద్రబాబు: కూలీ ఎంత ఇస్తున్నారమ్మా?
సరోజమ్మ: రూ.100 ఇస్తున్నారు సారు.

చంద్రబాబు: ఉపాధి పనులకు వెళ్లడం లేదా?
మంజుల: ఆ పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో, ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు. చంద్రబాబు: అవినీతి ప్రభుత్వానికి స్వస్తి చెప్పి త్వరలోనే టీడీపీ అధికారంలోకి వస్తుంది. మీ సమస్యలన్నీ తీరుస్తాం.

ఆంజనేయులు: మేము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కరువైంది. రాత్రివేళల్లో విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో కూడా తెలియడం లేదు. అప్పుల పాలవుతున్నాం.

చంద్రబాబు: అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోంది. రైతుల కష్టాలు తొలగిస్తామన్న కాంగ్రెస్..తీరని మోసం చేశారు. విద్యుత్ సమస్యపై అధికారుల వద్ద మొరపెట్టుకుంటే, కేసులు బనాయిస్తారా? త్వరలోనే మంచిరోజులొస్తాయి. రైతులకు సాగునీటి కోసం తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తాం. రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.

తిమ్మక్క: మాకు పింఛన్లు అందడం లేదు.
చంద్రబాబు: మేము వచ్చాక వృద్ధుల పింఛన్‌ను రూ.600కు పెంచుతాము.

సాయన్న: తాగడానికి నీరు అందడం లేదు
చంద్రబాబు: పక్కనే జూరాల డ్యాం ఉన్నా కానీ "చూడటానికి మాత్రమే కానీ తాగడానికి పనికి రాదు'' అన్న విధంగా ఉంది. స్థానిక మంత్రి ఉన్నా, జనాలకు తాగునీరు అందించడం లేదు. మా ప్రభుత్వం రాగానే ఎన్టీఆర్ సుజల ద్వారా ప్రతి గ్రామానికి నీరు అందే విధంగా చూస్తాం.
No comments :

No comments :