October 29, 2012

పేదల కష్టం తొలగేదాకా నిద్రపోనని ప్రతిన, వేగం అందుకున్న పాదయాత్ర (28వ రోజు )

తెలంగాణకు న్యాయం చేసే బాధ్యత నాదే!

ఇప్పుడూ ఎప్పుడూ నేను వ్యతిరేకం కాదు

పేదల కష్టం తొలగేదాకా నిద్రపోనని ప్రతిన
వేగం అందుకున్న పాదయాత్ర
గంటకు రెండు కిలోమీటర్ల నడక
బాబుకు కరుణానిధి పరామర్శ లేఖ
చుక్కా రామయ్య, పొత్తూరి సంఘీభావం
 తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఇప్పుడు గానీ, భవిష్యత్తులో గానీ తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు. పేదలు బతకడమే కష్టంగా మారిందని, వారి కష్టాలు తీర్చేదాకా నిద్రపోనని ప్రతీనబూనారు. కాంగ్రెస్ దొంగలను నమ్మితే మిగిలేది కష్టాలేనని హెచ్చరించారు. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రలో భాగంగా 27వ రోజు చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్, ఆత్మకూర్ మండలాల్లో పర్యటించారు.

రైతులు, మహిళలు, కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఊరి మొత్తానికి సామూహిక మరుగుదొడ్లు నిర్మిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లు కూడా కట్టని ఊళ్లు ఎన్నో చూశానని చెప్పుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు పెత్తందారిగా వ్యవహరిస్తుండగా ప్రజలు బానిసలుగా ఉండాల్సిన దుస్థితి కొనసాగుతోందంటూ మంత్రి డీకే అరుణపై పరోక్షంగా మండిపడ్డారు. గిరిజన నాయకుడు కొమురం భీం, వాల్మీకి స్ఫూర్తితో టీడీపీ పని చేస్తుందని చంద్రబాబు అన్నారు.

వాల్మీకి జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బోయలను కర్ణాటకలో ఎస్టీలుగా, తమిళనాడులో ఎస్సీలుగా గుర్తిస్తుండగా, మన రాష్ట్రంలోని మైదాన ప్రాంతంలో మాత్రం బీసీలుగా గుర్తించడం శోయనీయమన్నారు. వారిని తక్షణం ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు. కాగా, సోమవారం గంటకు రెండు కిలోమీటర్ల చొప్పున కొనసాగింది. ఆదివారం మధ్యాహ్నం మెల్లిమెల్లిగా నడిచిన చంద్రబాబు సోమవారం కొంత వేగం పెంచే ప్రయత్నం చేశారు.

ఉదయం 10.40 గంటలకు బయలుదేరిన ఆయన.. ధరూర్ మండలం పెద్దపాడు చేరుకొన్నారు. వేరు శనగచేనులోకి వెళ్లి మహిళా కూలీల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. కలుపు తీసే పరికరంతో కొద్దిసేపు కలుపు తీశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు చిన్నచింత రేవులకు చేరుకొని స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. సమీపంలోని కిరాణ షాపుకు వెళ్లి కూల్ డ్రింక్ తాగారు. మధ్యాహ్నం రెండున్నరకు జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. భోజనం చేసి కొద్దిసేపు విశ్రమించారు. 3.30లకు పాదయాత్ర కొనసాగించి ప్రాజెక్టు మీద నుంచి నందిమల్ల మీదుగా మూలమల్ల చేరుకున్నారు.

కరుణానిధి పరామర్శ: చంద్రబాబుకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి లేఖ రాశారు. ' బాబూ.. ఆరోగ్యం జాగ్రత్త'' అంటూ పరామర్శించారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని బాబుకు సూచించారు. యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ పట్టణంలో వేదిక కూలడంతో చంద్రబాబు వెన్నుకు దెబ్బతగిలిన విషయం తెలిసిందే. కాగా, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వర్లు సోమవారం ఉదయం చంద్రబాబు పాదయాత్ర వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటించి, ఆయనను పరామర్శించారు.

పాదయాత్ర తెలంగాణ సమస్యకు పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని చుక్కా రామయ్య వ్యక్తం చేశారు. కాగా, అధినేతకు సంఘీభావంగా టీడీపీ మహిళా విభాగం సోమవారం సాయంత్రం పాదయాత్రలో పాల్గొంది. విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శోభాహైమావతి, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ తదితరులు ఆత్మకూర్ మండలం నందిమల్ల వద్ద పాదయాత్రలో పాల్గొన్నారు.
No comments :

No comments :