September 11, 2013

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని చాటిచెప్పేందుకే మళ్లీ మీ ముందుకు వచ్చా

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని చాటిచెప్పేందుకే మళ్లీ మీ ముందుకు వచ్చానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాయకలు భ్రష్టు పట్టించారని, రాష్ట్రంలో ప్రజల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేపట్టిన ఆత్మగౌరవ బస్సుయాత్ర బుధవారం జిల్లాలోని తిరువూరు, గంపలగూడెం మండలాల్లో కొనసాగింది. దీంతో జిల్లాలో బాబు ఆరురోజుల బస్సు యాత్ర ముగిసింది.

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని చాటిచెప్పేందుకే మళ్లీ మీ ముందుకు వచ్చానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాయకలు భ్రష్టు పట్టించారన్నారు. రాష్ట్రంలో ప్రజల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేపట్టిన ఆత్మగౌరవ బస్సుయాత్ర బుధవారం జిల్లాలోని తిరువూరు, గంపలగూడెం మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్షల కోట్లు అవినీతి జరిగినా పాలకులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. చేతకాని నాయకులు రాష్ట్రాన్ని ఏలాలనుకొంటున్నారని, వ్యవస్థ అంతా సర్వ నాశనమయి పోయిందన్నారు.
యువతకు ఉపాధి, ఉద్యోగావాకాశాలు లేకుండా పోయాయన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియగాంధీ మీ జీవితాలతో ఆటలాడుకుంటోందన్నారు. మన్మోహన్ సోనియా చేతిలో కీలుబొమ్మ అని, దేశం కుంభకోణాల మయంగా మారిపోయిందని న్యూ యార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించిందని, దేశంలో నెలకొని ఉన్న దుస్థితికి ఇదే నిదర్శనమన్నారు. వైఎస్ హయాంలో రూ.43 వేల కోట్లు అవినీతి జరిగిందని సీబీఐ ఎనిమిది చార్జీషీట్లలో పేర్కొందన్నారు.
కాంగ్రెస్ దొంగలను ఆదర్శరైతుల కింద వైఎస్ సత్కరించారని తెలిపారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గపు రాజకీయాలు చేయొద్దని కాంగ్రెస్, వైసీపీలను హెచ్చరించారు. అన్నదమ్ముల్లా ఉన్న తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టారని వ్యాఖ్యానించారు. కొన్ని కుటుంబాల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే డీజిల్, పెట్రోల్ ధరలను పెంచమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పేదల నెత్తి గుదిబండలు వేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం తప్పో, ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు.