September 7, 2013

తెలుగువారికి ఎక్కడ ఇబ్బంది వస్తే అక్కడికి వస్తా

తెలుగుజాతికి ఎక్కడ, ఎప్పుడు ఇబ్బంది కలిగినా అక్కడికి వస్తా. మీ తరుపున రాజీ లేని పోరాటం చేస్తాను. మీకు సమన్యాయం జరిగేవరకు ఎవ్వరినీ వదిలి పెట్టను. అవసరమైతే వాళ్ల అంతు చూస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర విభజన ప్రకటనతో ఆందోళన చెందుతోన్న ప్రజలకు భరోసా ఇచ్చారు. చంద్రబాబు తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర శుక్రవారం జిల్లాలో తాడికొండ నియోజకవర్గం కంతేరు నుంచి ప్రారంభించారు. కంతేరులో ఆడబిడ్డలు మండుటెండను కూడా లెక్క చేయకుండా నాకు స్వాగతం పలుకుతున్నారు. యువకులు ఆకాశానికి ఎగిరెగిరి పడుతున్నారంటూ ఉత్సాహం నింపారు. కంతేరు టీడీపీ నేత వాసిరెడ్డి జయరామయ్య ఎన్నో బాధలు పడ్డారు. రాజీ లేని పోరాటం చేస్తున్నారని అభినందించారు.
తెలుగుజాతి విధ్వంసానికి కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీ కారకులయ్యాయని మండిపడ్డారు. వాళ్లు మన పొట్టలు కొట్టారు. లాలూచి, కుట్రపూరిత రాజకీయాలు చేస్తోన్న ఆ మూడు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల హక్కులు కాపడటానికి, మీకు అండగా ఉండటానికే నేను యాత్ర చేపట్టాను. రెండు చోట్ల మీ అంతం చూస్తాం. మిమ్మల్ని వదిలి పెట్టే ప్రశ్నే లేదని హెచ్చరించారు. సోనియా జగన్నాటకంలో వైసీపీ, టీఆర్ఎస్ పాత్రదారులని వాటిని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.
కంతేరులో యాత్ర ముగిసిన అనంతరం చంద్రబాబు నిడమర్రు చేరుకొన్నారు. మార్గమధ్యలో నిడమర్రు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి దానిని ఎంతో చక్కగా నిర్వహిస్తోన్న రైతులను అభినందించారు. ఇక్కడే ఎన్‌టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నిడమర్రులోని రెండు దళితవాడల్లో చంద్రబాబు ప్రసంగించారు. తెలుగుజాతి ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉన్నా ఒక్కటేనన్నారు. ఈ జాతికి ఒక అనుబంధః ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ ఎవరు తెలుగు మాట్లాడినా మన మనస్సులు పులకరించిపోతాయి. ఈ ప్రాంతం జాతి మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. అన్నదమ్ముల్లా ఉంటే కళ్లు కుట్టిన ఢిల్లీ పెద్దలు రాజకీయం కోసం చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన బెయిల్ కోసం తెలుగుజాతిని తాకట్టుకు పెట్టే పరిస్థితికి వచ్చాడన్నారు. నిడమర్రు శివారులో కాసేపు విశ్రాంతి తీసుకొన్న చంద్రబాబు ఆ తర్వాత బాపూజీనగర్, నీరుకొండ శిబిరం మీదగా మంగళగిరి పట్టణంలోకి చేరుకొన్నారు. అక్కడ ఎత్తురోడ్డు సెంటర్‌లో జరిగిన బహిరంగ సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీకి చదువు లేదని.. ఆమె నిరక్షరాస్యురాలైనందునే ఆమె పాలన కింద దేశం పూర్తిగా సర్వనాశనమైందని తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా విమర్శించారు. ఇందిరాగాంధీ కోడలిగా దేశంలో అడుగిడిన సోనియా తెలుగుజాతిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. ప్రధాని మన్మోహన్ ఆమె చేతిలో ఓ తోలుబొమ్మ.. కీలుబొమ్మ... ఇంకా ఎన్నన్నా తక్కువేనని ప్రధాని తీరుపై బాబు మండిపడ్డారు. బంగారం ధరలు తగ్గుతాయ్.. ఇప్పుడేమీ కొనొద్దంటాడు... రాత్రిళ్లు పెట్రోలు బంకులు మూసేస్తే వాడకం తగ్గి ధరలు తగ్గుతాయంటాడు. ఇలా ప్రధాని పిచ్చితుగ్లక్ పాలన చేస్తున్నాడు. వైఎస్ బతికుంటే తమకిన్ని కష్టాలు వచ్చేవి కావని ప్రధాని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికి తమ విచారణలో రూ.43 వేల కోట్ల అవినీతి జరిగినట్టు తేలిందని.. మొదటి ముద్దాయిగా వైఎస్‌ను పేర్కొంటూ ఆయన చనిపోయినందున జగనే తొలి ముద్దాయని సీబీఐ చెప్పడాన్ని ప్రధాని మర్చిపోవడం విచారకరమన్నారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అసమర్ధతతో దేశం భ్రష్టు పట్టిపోయింది. లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం తాలూకూ ఫైళ్లు బొగ్గులోనే కలిసిపోయాయి. ఆ ఫైళ్లు వుంటే రాబోయే రోజుల్లో జైలుకు పోతామన్న భయంతోనే వాటిని కాల్చివేశారని చంద్రబాబు ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో అవినీతిపరులు ఎంతటి వాళ్లయినా గుండెల్లో రైళ్లు పరుగెత్తించామని అన్నారు.
కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించండి
దేశానికి మోక్షం కలగాలంటే కాంగ్రెస్‌ను మళ్లీ చిత్తుగా ఓడించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. రగులుతున్న తెలుగుజాతి గుండపై ఒట్టేసి చెబుతున్నా.. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేద్దాం.. రండంటూ ఆవేశంగా అన్నారు. ప్రజల పొట్టలు కొట్టిన కాంగ్రెస్‌ను చిత్తు చిత్తు చేసి బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు పౌరుషంతో కదిలిరావాలని అభ్యర్థించారు.
చేతకాకుంటే తప్పుకోండి..
ఆర్నెల్లలో పరిష్కరిస్తాం
రాష్ట్రాన్ని , దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్ పాలకులకు సమస్యల పరిష్కారం చేతకాకుంటే రాజీనామా చేసి తప్పుకోవాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలకులు పదవుల నుంచి తప్పుకుని ఎన్నికలకు సిద్ధపడితే తాము గెలిచి ఆరు మాసాల్లో సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అంతేకాకుండా అసమర్ధ ప్రధాని, అవినీతి సోనియా కారణంగా గాడితప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను కూడా చక్కబెట్టగలమని బాబు ధీమాగా చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, మంగళగిరి టీడీపీ కన్వీనర్ పోతినేని శ్రీనివాసరావు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు ఆరుద్ర అంకవరప్రసాద్, పట్టణ టీడీపీ అధ్యక్షులు నందం అబద్దయ్య, టీడీపీ నేతలు బెల్లంకొండ నరసింహారావు, మహమ్మద్ ఇబ్రహీం, వల్లభనేని సాయిప్రసాద్, కొల్లి లక్ష్మయ్యచౌదరి, గంజి చిరంజీవి, వల్లూరు సూరిబాబు, మన్నెం మార్కండేయులు, సంకా బాలాజీగుప్తా, కొత్తపల్లి శ్రీనివాసరావు, మాదల రమేష్, గాదె పిచ్చిరెడ్డి, జవ్వాది కిరణ్‌చంద్, వెలగపాటి విలియం, ముశం రవికుమార్, కోనంకి శ్రీనివాసరావు, వుయ్యూరు నాగిరెడ్డి, కగ్గా శ్రీనివాసరావు, సయ్యద్ జిలానీ, షేక్ నన్నె, షేక్ రియాజ్, మునగాల సత్యనారాయణ, గుత్తికొండ ధనుంజయరావు, పఠాన్ ఖాశీంఖాన్, పొన్నం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరిలో బాబు
యాత్రకు అడ్డుపడ్డ ఎన్జీవోలు
మంగళగిరి టౌన్: ఆత్మగౌరవ యత్రలో భాగంగా శుక్రవారం మంగళగిరి విచ్చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును ఏపీఎన్జీవోలు, మంగళగిరి ఉద్యోగ, కార్మిక ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధులు, ఉపాధ్యాయ జేఏసీ, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖ, ఉపఖజానా ఉద్యోగులు, పలువురు సమైక్యవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగుతుండగా, ప్లకార్డులు పట్టుకుని ఉద్యోగస్తులు ముందుకు సాగడంతో ఉద్యోగులు బాబు వాహనాన్ని ఆపి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
జిల్లా నేతలకు అభినందనలు
ఆరు రోజుల పాటు తన యాత్ర లో జిల్లాలో విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మం త్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జే ఆర్ పుష్పరాజ్, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జీ వీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, ఇన్‌చార్జ్‌లు నిమ్మకాయల రాజనారాయణ, తెనాలి శ్రావణ్‌కుమార్, పోతినేని శ్రీనివాసరావు, పార్టీ నేతలు మన్నవ సుబ్బారావు, బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, చిట్టాబత్తిన శ్రీనివాసరావు, మానుకొండ శివప్రసాద్, దాసరి రాజా, దామచర్ల శ్రీనివాసరావు, కొర్రపాటి నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు ముత్తినేని రాజేష్, వేములపల్లి శ్రీరాంప్రసాద్, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావు, టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు రావిపాటి సాయికృష్ణను ఉండవల్లి వద్ద చంద్రబాబు భుజం తట్టి అభినందించారు.