September 7, 2013

మీకోసం తెగబడతా, అవసరమైతే తిరగబడతా : ఆత్మగౌరవయాత్రలో చంద్రబాబు

' తెలంగాణా ప్రజలకు న్యాయం చేయమంటే మీకు అన్యాయం చేయమని కాదు. ఇక్కడ, అక్కడ ప్రజలతో మాట్లాడాలి. ఇద్దరికీ న్యాయం జరగాలి. అలా కాకుండా మీకు అన్యాయం జరిగితే తెగబడతా ! అవసరమైతే తిరగబడతా !! సీమాంధ్రుల ప్రతినిథిగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సమైక్యానికి ఒకప్పుడు కట్టుబడి ఉన్న మాట వాస్తవమే ! ఆ తర్వాత తెలంగాణా ప్రజల ఉద్యమం, మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వారి సమస్యలను పరిష్కరించమని లేఖ ఇచ్చిన మాట వాస్తవమే అయినా మీకు ఎక్కడా అన్యాయం చేయమనలేదు. సీమాంధ్రలో ఉండే తెలుగువారికి ఇబ్బందులు ఉన్నాయి. 37 రోజులుగా ప్రజలు రోడ్లెక్కుతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్‌కు కనువిప్పు కలగలేదు. మొద్దు నిద్రలో ఉంది. ఇప్పటికైనా మీ నిర్ణయం మార్చుకోండి. లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు.' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లాలో ఆత్మగౌరవ బస్సు యాత్ర శనివారం రెండవ రోజుకు చేరుకుంది. గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. బాబు యాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్షం పడినా లెక్క చేయకుండా బాబు ప్రసంగాలు విన్నారు. నాలుగు సీట్ల కోసం రాష్ట్రంలో చిచ్చుపెట్టిన వారు దేశంలో మనుగడ సాధించటానికి వీలులేదని, సోనియాకు సీట్లు కావాలంటే తెలుగువాళ్ళు కొట్లాడుకోవాలా ? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించి అందులో రాజకీయ లబ్ధి పొందాలని వైకాపా చూస్తోందని దుయ్యబట్టారు.