September 7, 2013

దోపిడీదారు సోనియా

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేస్తున్న దోపిడీని అరికడితే దేశంలో అన్ని ధరలు తగ్గుతాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలోనే పెద్దమాఫియా ఇటలీలో ఉందని, ఆ ఇటలీ నుంచి సోనియా గాంధీ వచ్చిందని, పులివెందులలో వైఎస్‌ది ఫ్యాక్షన్ కుటుంబమని, హత్యలు, రౌడీయిజం వారికి మంచినీళ్ళ ప్రాయమని, ఆ ఇద్దరూ కలిసి దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకొని భ్రష్టు పట్టించారని అన్నారు. శనివారం రాత్రి నూజివీడులో జరిగిన తెలుగుజాతి ఆత్మగౌరవయాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మగాంధీ బైబిల్ నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు తెలిపారు. అలాంటి పవిత్రమైన బైబిల్‌ను చేతిలో పట్టుకొని విజయలక్ష్మి పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు. బైబిల్‌ను పాటించే వారు వాస్తవాలు చెబుతారు, నిజాయితీగా వ్యవహరిస్తారు. దోపిడీదారులుగా ఉండరు. అలాంటి పవిత్ర బైబిల్‌ను చేతబట్టి విజయలక్ష్మి తప్పుడుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. వైఎస్ఆర్ పార్టీ వారు అహంకారంతో రౌడియిజంగా వ్యవహరిస్తున్నారన్నారు. అందుకే ఆ పార్టీలో అందరూ రౌడిలే చేరుతున్నారన్నారు.
న్యాయం జరగకపోతే
ఏం చేయాలో అది చేస్తా!
36 రోజులుగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి కాంగ్రెస్ చేసిన అన్యాయ ప్రక్రియపై పోరాడుతుంటే, ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తెలుగు ప్రజలకి అండగా ఉంటానని, న్యాయం జరగకపోతే ఏం చేయాలో అదిచేసి చూపిస్తానని చంద్రబాబు ప్రజల హర్షధ్వానాల మధ్య స్పష్టం చేశారు. దానికి మీరు సహకరించాలని కోరారు. గతంలో టీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు, అధికార కాంగ్రెస్‌పార్టీ వాస్తవాలు ప్రజలకు చెప్పకుండా మోసం చేసిందన్నారు. తెలంగాణాకు అనుకూలంగా నాటి పరిస్థితులను బట్టి లేఖ ఇచ్చిన మాట నిజమేనని, అయితే సీమాంధ్ర ప్రజలకు కూడా న్యాయం జరగాలని తాను చెప్పానన్నారు. రాజకీయాలను తాను ఒక పద్ధతి ప్రకారం, ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్వహించానే తప్ప, ప్రజలకు ఇబ్బందులు, నష్టం కల్గించే విధంగా ఏనాడు చేయలేదన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి ఎన్టీఆర్, తరువాత తనవల్లే జరిగిందన్నారు. ఇప్పుడు కూడా తాను ప్రజల కోసమే ఈ యాత్ర చేస్తున్నానని, తన స్వార్ధం కోసం కాదన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు పాదయాత్ర సందర్భంగా హామీలు ఇచ్చానని, అవన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తానని ఆయన సదరు హామీలను పునరుద్ఘాటించారు.
రైతులకు పూర్తిరుణమాఫీ చేస్తానని, మరోసారి స్పష్టం చేశారు. తెలుగువారిని దిక్కులేని వారిగా చేస్తున్నారని, సీమాంధ్ర ప్రజలను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రోజుకో వి«ధంగా అవమాన పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత చంద్రబాబు కన్నా ముందు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమ, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ళ నారాయణ, మాజీ పార్లమెంట్‌సభ్యుడు మాగంటి బాబులు ప్రసంగించారు. చంద్రబాబు ప్రసంగం ముగిసిన అనంతరం నూజివీడు జేఏసీ చెందిన కొద్దిమంది చంద్రబాబును సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని కోరుతూ మెమోరాండం సమర్పించారు.