September 23, 2013

'రాష్ట్ర విభజనకు మీరు కూడా లేఖ ఇచ్చారు కదా!?'

దేశవ్యాప్తంగా ఉన్న పది కోట్ల మంది తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టి జాతీయ సమగ్రత ఎలా సాధిస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన సోమవారం జరిగిన జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో ఆ యన మాట్లాడారు. తొలుత అజెండా ప్రకారం మత సామరస్యం, మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడుల గురించి మాట్లాడిన చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఉద్యమాలను ఎందుకు అజెండాలో పేర్కొనలేదని ప్రశ్నించారు.


"2009 నుంచి తెలంగాణలో వరుస ఉద్యమాలు జరిగాయి. వందలాది యువత ఆత్మహత్యలు చేసుకున్నా రు. తెలంగాణ ఉద్యోగుల పిలుపుతో ప్రజలంతా 42 రోజులపాటు సకల జనుల సమ్మె నిర్వహించారు. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు 55 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆ ప్రాంతంలో యంత్రాంగం స్తంభించింది. ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. సచివాలయంలోను, ఇతర కేంద్ర కార్యాలయాల్లోను ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉద్యోగుల మ« ద్య సామరస్యం దెబ్బతింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానికి రెండు లేఖలు రాశాను.

కానీ, కేంద్రం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేవు. రాష్ట్ర ప్రజలంతా మనో వేదనతో ఆందోళనలు చేస్తోంటే కేంద్రానికి పట్టదా?'' అని బాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎంతో తీవ్రంగా ఉంటే ఉన్నతస్థాయి వేదిక అయిన ఎన్ఐసీలో దానిని ఒక అంశంగా చేర్చి చర్చించరా? అని నిలదీశారు. దీంతో, వేదికపై ఉన్న సోనియా గాంధీ అప్రమత్తమయ్యారు. చంద్రబాబు ఆ విషయాలన్నీ మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారని ఆమె సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం తదితరులను ప్రశ్నించారు. దీంతో, తొలుత షిండే జోక్యం చేసుకుని..
'రాష్ట్ర విభజనకు మీరు కూడా లేఖ ఇచ్చారు కదా!?' అని ప్రశ్నించారు. "అవును ఇచ్చాను. అయితే, ఇప్పుడు తలెత్తిన పరిస్థితులను పరిష్కరించరా? ఆందోళన చెందుతున్న ప్రజలకు సామరస్యపూర్వక పరిష్కారం చూపించరా?'' అని బాబు ప్రశ్నించారు.

దీంతో 'అసలు ఆ విషయం అజెండాలో లేదు. కాబట్టి మీరు మాట్లాడటం కుదరదు' అని చిదంబరం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతుంటే కేంద్రం పట్టించుకోకపోవడం సరికాదని చంద్రబాబు అన్నారు. 'అయితే మీరు చెప్పాల్సింది చెప్పారు కదా! ఇంకేంటి?' అని చిదంబరం ప్రశ్నించారు. మైక్ కట్ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. 'కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేను వాకౌట్ చేస్తున్నాను' అని ప్రకటించి బయటకు వచ్చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, కేంద్రం తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని అవమానించాయని విమర్శించారు. తెలంగాణ అంశంపై మాట్లాడేందుకు అసోం సీఎంకి అవకాశం ఇచ్చిన వాళ్లు తాను మాట్లాడుతుంటే మాత్రం ఎందుకు మైక్ కట్ చేశారని ప్రశ్నించారు.


కేంద్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుపై ప్రకటన చేసిన వెంటనే తమ రాష్ట్రంలో మూడు ప్రత్యేక రాష్ట్రాల కోసం నిరసనలు మొదలయ్యాయని, వాటిని సమర్థంగా పరిష్కరించామని అసోం సీఎం తరుణ్ గొగోయ్ తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఎన్ఐసీ భేటీలో వివరిస్తూ.. మధ్యలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.