September 23, 2013

ఎ2, ఎ4 బయటకు రాలేని స్థితిలో ఎ1గా ఉన్న జగన్ ఎలా బయటకు వస్తాడు?


కాంగ్రెస్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడంవల్లే అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ వచ్చిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌గా మారిందని విమర్శించారు. రాష్ట్ర విభజన ప్రకటన రోజే జగన్ కాంగ్రెస్ డీఎన్ఏగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రకటన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.

జగన్ ఆస్తుల కేసును నీరు గార్చేందుకు కాంగ్రెసు ప్రయత్నించిందని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ని, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని విలీనం చేసుకోవాలని కాంగ్రెసు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఓట్లు సీట్లు కావాలి, ఎవరు ఏమైనా ఫర్వాలేదనే పద్ధతిలో కాంగ్రెసు వ్యవహరిస్తోందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైయస్ జగన్‌కు సంబంధించి కొన్ని కేసుల్లో క్విడ్ ప్రోకో లేదని సిబిఐ హడావిడిగా చెప్పిందని, వైయస్ జగన్ కేసులో ఇప్పటి వరకు ఈడి విచారణ జరగకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

ఎ2, ఎ4 బయటకు రాలేని స్థితిలో ఎ1గా ఉన్న జగన్ ఎలా బయటకు వస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.  జగన్ కేసులో సాధారణ స్థాయిలో పెట్టాల్సిన న్యాయవాదులను కూడా సిబిఐ పెట్టలేదని ఆయన అన్నారు. చార్జీషీట్లు మొత్తం దాఖలు చేసిన తర్వాతే జగన్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. చార్జిషీట్లు దాఖలు చేయకముందే జగన్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారని ఆయన అన్నారు. వైయస్ జదగన్ బరి తెగించి, అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు.
ఓఎంసీ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి రెండేళ్లుగా జైలులో ఉన్నారని, సత్యం రామలింగరాజు ఆస్తులను జప్తు చేశారని, రామలింగ రాజు నాలుగేళ్ల పాటు జైలులో ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. కోల్‌కతా కంపెనీలు జగన్ కంపెనీల్లో అక్రమంగా పెట్టుబడులు పెడితే ఈడి ఏం చేస్తోందని ఆయన అడిగారు. 16 నెలల పాటు ఈడి ఏ విధమైన చర్యలూ తీసుకోలేదని, ఈడి, సిబిఐల ఉదాసీనతలపై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
 రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఎన్ఐసీ సమావేశంలో చెప్పాలని తాను భావిస్తే  తనకు మైక్ ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కాంగ్రెసు పార్టీ పురమాయించి పరిస్థితులను దిగజారుస్తోందని ఆయన విమర్శించారు. సిడబ్ల్యుసి తీర్మానం చేయడానికి ముందే సమాచారం ఇచ్చి వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులతో కాంగ్రెసు రాజీనామాలు చేయించిందని ఆయన ఆరోపించారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీవీసీని కలిసామని చంద్రబాబు పేర్కొన్నారు. మొదటి నుంచి అవినీతిపై టీడీపీ అలుపెరగని పోరాటం చేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్-వైసీపీ పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.