September 23, 2013

ఆ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అవకాశం ఇచ్చారని టీడీపీ ప్రతిపక్షం కాబట్టి అడ్డుకున్నారు.. .......


ఎన్ఐసీ నుంచి బాబు వాకౌట్
తెలుగువారికి అవమానం:బాబు



  నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ (ఎన్ఐసీ) సమావేశాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బహిష్కరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సమస్యలు ప్రస్తావించవద్దని అడ్డుకున్నారు. అందుకే ఎన్ఐసీ సమావేశాన్ని బహిష్కరించినట్లు ఆయన తెలిపారు. సోమవారం ఎన్ఐసీ భేటీ నుంచి బయటకు వచ్చిన అనంతరం చంద్రబాబు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలను ప్రస్తావించవద్దని కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం అడ్డుకున్నారని అన్నారు. సమావేశంలో తెలుగువారికి అవమానం జరిగిందని, అందుకే నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేశామని చంద్రబాబు ఆవేదనగా పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నలలో నడుస్తున్నారని, ఆయన సీటు కోసం పాకులాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు కనీసం తనకు మద్దతు తెలపలేదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్ళుగా రాష్ట్రం తగలబడుతుంటే ఎన్ఐసీలో చర్చించాల్సిన అవసరం లేదా? అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో సమస్యలు లేనట్లే సీఎం ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

రాజకీయ లబ్దికోసమే కాంగ్రెస్ రాష్ట్రంలో సమస్యలు సృష్టిస్తోందని చంద్రబాబు «నాయుడు ధ్వజమెత్తారు. సీమాంధ్రలో 55 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా, సమస్యల గురించి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మకం కోల్పోతున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజనపై దేశంలో ఉన్న మేధావులు అందరూ ఆలోచించాలని ఆయన అన్నారు.

అస్సాం రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు ఎన్ఐసీలో అవకాశం కల్పించారని అన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అవకాశం ఇచ్చారని టీడీపీ ప్రతిపక్షం కాబట్టి అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి అవమానమని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్రంలో ఎలా పోరాటం చేయాలో తెలుసునని, అలాగే ఢిల్లీలో కూడా పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.