August 6, 2013

టీ టీడీపీ సారథి ఎవరు?

తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం ప్రకటించడంతో రాష్ట్ర విభజన ప్రక్రియ ఇక లాంఛనమేనంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదిస్తే విభజన దాదాపు ఖరారైనట్లుగానే భావించవచ్చు. రాజ్యాంగ పరంగా రాష్టప్రతి దానికి ఆమోద ముద్ర వేస్తే విభజన తంతు ముగిసినట్లే. అయితే నిజంగానే రాష్ట్రం అలా విభజన అంటూ జరిగితే తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనూ, సీమాంధ్రలోనూ పార్టీ రాష్ట్ర సారధులను అనివార్యంగా నియమించుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అన్ని పార్టీల మాదిరే తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రానికి తన పార్టీ అధ్యక్షుడిగా ఆ ప్రాంత నేతలకే అవకాశం కల్పించాల్సి వస్తుంది. విభజన దాదాపు ఖాయమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి పార్టీ సారధ్య బాధ్యతలను స్వీకరించేందుకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు చాలా ఉత్సాహంతోనే ఉన్నారని సమాచారం.

తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర రావు అయితే మరో ముందడుగు వేసి తానే సీఎంను అవుతానని ప్రకటించేశారు కూడా. ఎర్రబెల్లి విషయం అలా ఉంచితే .. సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింలుతో పాటు పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావుతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ టీడీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వీరిలో ఒక్కో నేతది ఒక్కో విశిష్టత కల్గిన వారే. ఎర్రబెల్లి దయాకరరావునే తీసుకుంటే టీడీపీ తెలంగాణ ఫోరంకు కన్వీనర్‌గా ఉండడమే కాకుండా ఆ ప్రాంత ఎమ్మెల్యేలందరినీ ఒకే తాటిపై నడిపించారు. తెలంగాణ ఉద్యమంలోనూ కేసిఆర్‌ ఆపరేషన్‌ ఆకర్స్‌ వలకు పార్టీ నేతలు చిక్కుకోకుండా పార్టీని, ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ వచ్చారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డినే తీసుకుంటే పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న రేవూరికి తెలంగాణపై పూర్తి అవగాహన ఉంది.

ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణపై తొలి సారి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంకు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా హాజరయ్యారంటే ఆయనకు పార్టీలో ఎంతటి ప్రాధాన్యత ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇక పోతే ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సాగునీటి రంగంపట్ల పూర్తి అవగాహన ఉంది. ఆయన గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పని చేసిన అనుభవం ఉండడంతో ఆయన్ను తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సారధిగా నియమించవచ్చంటున్నారు. రాష్టాన్ని విభజించడం ద్వారా తలెత్తే జల వివాదాలకు చక్కటి పరిష్కారం చూపించే నాయకుడు ఎవరైన ఉన్నారా? అంటే అది ఒక్క తుమ్మల మాత్రమేనని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక పోతే తెలంగాణ రాష్ట్ర విభజనలో కీలకమైన హైదరాబాద్‌ నుండి కూడా ఇద్దరు నేతలు రేసులో ముందున్నారంటున్నారు. వీరిలో ఒకరు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కాగా.. మరో నాయకుడు తీగల కృష్ణారెడ్డి అని తెలుస్తోంది. మొత్తం మీద అందరూ ఉద్దండులే కావడంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎవరి వైపు మొగ్గు చూపుతారో.. నని సర్వత్రా ఆసక్తి నెలకొంది.