August 6, 2013

టీడీపీ ర్యాలీ, ధర్నా

సమైక్యాంధ్ర కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో మాగంటి బాబు, అంబికా కృష్ణ, బడేటి బుజ్జిలు నగరంలో ర్యాలీ నిర్వహించి ఫైర్‌స్టేషన్ వద్ద కార్యకర్తలతో బైఠాయించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు మాట్లాడుతూ కాంగ్రెస్, వైసీపీ నాయకులు టీడీపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ర్రాష్టాన్ని విభజించడానికి ఆ రెండు పార్టీలు కారణమైతే తెలుగుదేశమే కారణమని నిందలు వేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ముందుగానే విభజన గురించి తెలిసి ఏమీ జరగటం లేదని ప్రజలను మోసపుచ్చారన్నారు. మాగంటి బాబు కార్యకర్తలను ఉత్సాపరుస్తూ నృత్యాలు చేయడంతో సమైక్యవాదులు ఆకర్షించారు.
ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ అంబికా కృష్ణ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం శాంతియుతంగా చేస్తుంటే కేంద్రప్రభుత్వం పారా మిలటరీ దళాలను దించడం ఎంత వరకు సమంజసమన్నారు. చైనా సరిహద్దుదాటి మన దేశంలోకి చొచ్చుకువస్తుంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ఇక్కడ శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే తమపై ఏకె 47లు గురిపెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడేటి బుజ్జి మాట్లాడుతూ ర్రాష్టాన్ని సమైక్యాంగానే ఉంచాలని లేని పక్షం లో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలని, అప్పటి వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. టీడీపీ కార్యకర్తలు, టిఎన్‌టియుసి నాయకులు కరుణకుమార్ ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో వంటావార్పును నిర్వహించి అక్కడే భోజనాలు చేసి నిరసనను వ్యక్తం చేశారు.