August 6, 2013

కేసీఆర్‌ను చంపవలసిన అవసరం ఎవరికీ లేదన్న సోమిరెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర రావుపై హత్యా యత్నానికి కొందరు కుట్ర పన్నారని టీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, ఈటెల చేసిన ఆరోపణలను తెలుగుదేశం నాయకుడు
సోమిరెడ్డి ఆక్షేపించారు. కేసీఆర్‌ను హతమార్చవలసిన అవసరం ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ తమ ఎజెండా మావోయిస్టుల ఎజెండాయేనని అనడాన్ని ఆయన తప్పుపట్టారు. కేసీఆర్ తెలంగాణాలో ఇంటింటికీ లైసెన్సు లేని తుపాకులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర విభ జనపై కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనతో రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంటే ముఖ్యమంత్రి ఇంట్లో ఫిడేలు వాయిస్తూ కూర్చుంటారా అని ఆయన ఎద్దేవా చేశారు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది అని ఆయన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాలనూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏం మాట్లాడుతారో ఎందుకు మాట్లాడుతారో, ఎప్పుడు ఎక్కడ మాట మార్చుకుంటారో అర్థం కాదని ఆయన మండిపడ్డారు. ఒకరు ఇక్కడేమో పదవులు త్యజిస్తామంటారు, ఢిల్లీ పోగానే మాట మార్చేస్తారు, బొత్స రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటంటారు, తిరుపతి వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని దేవుణ్ణి మొక్కుకున్నానంటారు, మళ్లీ ఆయనే ఢిల్లీ వెళ్లి మీరు ఎలా చెబితే అలా అంటారు ఇదేం పద్ధతి అని సోమిరెడ్డి విరుచుకుపడ్డారు.