August 4, 2013

రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా

 రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి ఆదివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీకి పంపించారు. అనంతరం  ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రి దివంగత ఎన్టీఆర్‌కు  నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ష మీడియాతో మాట్లాడుతూ  మనమంతా అన్నతమ్ములుగా కలిస ఉన్నాం, ఒకే భాష మాట్లాడుతున్నాం, అలాంటి తెలుగువారని విభజించేందుకు కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. స్వార్థపర రాజకీయ నాయకులు ఆడే నాటకంలో మనమంతా భాగస్వాములం అయిపోతున్నామని హ
రికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే సమైక్యతలో ఉన్న మాధుర్యం దూరం అవుతుందన్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం షష్ఠిపూర్తి చేసుకునే దశలో విడిపోవడం చాలా బాధాకరమని హరికృష్ణ పేర్కొన్నారు. అసలు రాష్టంలో ఏమి జరగుతుందో ఢిల్లీ పెద్దలకు తెలియడం లేదన్నారు. ఢిల్లీలో కూర్చుని కళ్లకు గంతలు కట్టుకుని నిర్ణయం తీసుకుంటే ఏలా అని కాంగ్రెస్ పెద్దలను ప్రశ్నించారు. రాష్ట విభజన వల్ల నీళ్లు, కరెంట్, పాలన పరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వాటిపై చర్చించకుండా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై ఏక పక్ష నిర్ణయం తీసుకోవడం ఏమిటని హరికృష్ణ నిలదిశారు.