July 15, 2013

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది కాంగ్రెస్సే : యనమల

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత తొమ్మిదేళ్లలో ఛిన్నాభిన్నం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు విమర్శిం చారు. లక్షల కోట్ల అవినీతి లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ను మింగేసిందని ఆయన సోమవారంనాడొక ప్రకటనలో ఆరోపించారు. ముగ్గురు మంత్రులు నాయకత్వం వహించినా ఆర్థిక వ్యవస్థ 2007-08 నుండి మరింత సంక్షోభంలో పడిందని ఆయన పేర్కొన్నారు. 1999-2004 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం సంస్కరణల ద్వారా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దిన ప్రభావం 2006-07 వరకు కొనసాగిందన్నారు. 2004-05 నుండి 2006-07 వరకు వృద్ధిరేటు బాగానే ఉందన్నారు. రెండో సారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్ల సగటు కేంద్రం కంటే తక్కువగా ఉండటం ఆందోళనకరమన్నారు.

సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి అసలు వాస్తవాలను మరుగు పరిచి, దేశ ఆర్థిక వ్యవస్థ కంటే రాష్ట్రం పరిస్థితి బాగుందని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. 2009-13 మధ్య నాలుగేళ్ల సగటును పరిశీలిస్తే జీడీపీ 7.3 శాతం ఉండగా, జీఎస్‌డీపీ 6.8 శాతం మాత్రమే ఉందన్నారు. అదే విధంగా జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం 14 శాతం ఉండగా రాష్ట్రంలో 13. 7 శాతం ఉందన్నారు. వైఎస్‌ హయాంలో, తర్వాత సీఎంల పాలనలో సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి సమిష్టి లబ్దిని గాలికొదిలేసినందుకే రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ అతలా కుతలం అయిందన్నారు. లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలు లక్ష కోట్ల బడ్జెట్‌ను మింగేశాయని విమర్శించారు. వైఎస్‌ పాలనలో జరిగిన అవినీతికి అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు తీసుకోకుండా తరువాత ముఖమంత్రులు కూడా అదే దారిలో నడవడంతో వ్యవస్థలు పూర్తిగా గాడి తప్పాయని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సకాలంలో వర్షాలు పడినా, విత్తనాలు, ఎరువుల కొరత, విద్యుత్‌ కోతల వల్ల ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 19 శాతం నాట్లు తక్కువ పడడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. రాష్ట్రం ఉత్పత్తి తగ్గిపోయి వ్యవసాయాభివృద్ధి లేనప్పుడు ఆర్థికాభివృద్ధి ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.