July 15, 2013

ఆగస్టు మొదటి వారంలో ... చంద్రన్న బస్సుయాత్ర

అన్ని పార్టీలు సాధారణ ఎన్నికల కోసం రోడ్‌మ్యాప్‌ను తయారు చేసుకుని అమలు చేసే పనిలో పడ్డాయి. పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని ఆరాటపడుతున్న బాబు ఎన్నికలు వచ్చేంత వరకు జనం మధ్యలో వుండాలని నిర్ణయించు కున్నారు. ఇంతకు ముందు గత ఏడాది అక్టోబర్ 2నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 27 వరకు 20 రోజుల పాటు 2340 కి.మీ.ల సుదీర్ఘ పాదయాత్రను మోకాలు నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలను అధిగమిస్తూ విజయవంతంగా పూర్తిచేసిన బాబు, మలి విడతలో బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. పాదయాత్రతో పార్టీకి నూతన జవసత్వాలు అందించినట్టుగా ఇమేజ్ రావడంతో ఆ ఒరవడినికొన సాగించాలని భావిస్తున్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర ద్వారా అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాలను చుట్టుముట్టారు. మలివిడతగా చేపట్టే బస్సు యాత్రలో చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించనున్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ప్రజలు అసంతపృత్తిగా వున్నారని, వైకాపా పట్ల కూడా ప్రజలు ఇదివరకటి అభిప్రాయాన్ని మార్చుకున్నారని, ఈ పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీవైపు తిరిగి మొగ్గు చూపుతున్నారని గట్టిగా నమ్ముతున్న చంద్రబాబు బస్సు యాత్రను కూడా ప్రతిష్టాత్మంగా తీసుకున్నట్టు చెబుతున్నారు. నిరంతరమూ ప్రజల మధ్య వుండి, వారి సమస్యల కోసం పనిచేస్తుంటే, ఆదరిస్తారనేది బాబు నమ్మకం. ప్రజలు రాష్ర్టంలో సుస్థిర పాలనను, సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని నమ్ముతున్న బాబు అది అందించే సత్తా ఒక తెలుగుదేశం పారీే్టక వుందని ప్రజల్లోకి వెళ్ళి తిరిగి పార్టీకి పూర్వ వైభవం తేవాలని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్తున్నా, పార్టీకి గ్రామ, పట్టణ స్థాయిల్లో వున్న పటిష్టమైన శ్రేణీ వ్యవస్థ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తుందని, కార్యకర్తల బలం, ప్రజల అభిమానంతో తిరిగి అధికార పగ్గాలు చేపట్టేది ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంపూర్ణ విశ్వాసంతో వున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.