July 15, 2013

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు న్యాయం చేయండి

సీబీఎస్ఈ, సీఎస్ఏబీ, జేఈఈ చైర్మన్‌లకు చంద్రబాబు లేఖలు
ఐఐటీ ప్రవేశ పరీక్షలపై కేంద్రం తెచ్చిన కొత్తవిధానం వల్ల రాష్ట్ర విద్యార్థు లు తీవ్రంగా నష్టపోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. రాష్ట్ర విద్యార్థులలో ప్రతిభ ఉన్నప్పటికీ ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ, ఎన్ఐటీ, సీఎఫ్‌టీఐ వంటి సం స్థల్లో కేంద్రం కొత్త విధానంతో ప్రవేశార్హతను కోల్పోతున్నారని మండిపడ్డారు. సీబీఎస్ఈ, సీఎస్ఏబీ, జేఈఈ చైర్మన్లకు, సీబీఎస్ఈ-జేఈఈ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు ఆదివారం ఆయన లేఖలు రాశారు. ఎన్ఐటీల్లో 2,500, ఐఐటీల్లో 1,500 సీట్ల వంతున ఏపీ విద్యార్థులు కోల్పోతున్నారని పేర్కొన్నారు.

ఐఐటీ, ఐఐఐటీ, సీఎఫ్‌టీఐ ప్రవే శాల్లో జరిగిన ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని కోరారు. కొత్త విధానం కారణంగా రాష్ట్రానికి చెందిన పెద్ద సంఖ్యలో విద్యార్థుల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ఐఐటీ(అడ్వాన్స్‌డ్) పరీక్షల్లో మంచి మార్కులు సాధించినప్పటికీ, ప్లస్ టూ పరీక్షలకు సంబంధించి వెయిటేజీ మార్కుల నిబంధన కారణంగా ఐఐటీల్లో ప్రవేశాన్ని పొందే అవకాశాలు మూసుకుపోయినందున విద్యార్థులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. అభ్యర్థుల ఎంపికకు జేఈఈ మార్కులనే ప్రాతిపదికగా తీసుకోవాలని, 2012 వరకు కొనసాగిన ఇదే విధానంలో ఎటువంటి లోటుపాట్లు లేవని తెలిపారు. జేఈఈ(మెయిన్స్)కు సంబంధించి ఇంటర్మీడియెట్ మార్కులకు 40 శాతం మేరకు వెయిటేజీ ఇవ్వాలన్న కొత్త నిబంధన కారణంగా ఇటు రాష్ట్రానికి చెందిన విద్యార్థులలో అయోమయం నెలకొనడంతోపాటు రాష్ట్రాల మధ్య అంతరాలు సైతం పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

జేఈఈ(అడ్వాన్స్‌డ్)కు సంబంధించి కూడా ఇంటర్మీడియెట్/ప్లస్ టూల్లోని కట్ ఆఫ్ మార్కుల విషయానికొస్తే త్రిపుర రాష్ట్రంలో 53 శాతం ఉండగా, మహారాష్ట్రలో 68 శాతంగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 91.89 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులు పెద్ద సంఖ్యలో జేఈఈ(అడ్వాన్స్‌డ్, మెయిన్స్) పరీక్షల్లో మంచి మార్కులు సాధించినప్పటికీ ఎన్ఐటీ, ఐఐఐటీ, సీఎఫ్‌టీఐ, ఐఐటీల్లో మాత్రం ప్రవేశాన్ని పొందలేని పరిస్థితులేర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఎన్ఐటీల్లో 2,500 సీట్లను, ఐఐటీల్లో 1,500 సీట్లను కోల్పోతున్నట్లుగా తెలుస్తోందని చంద్రబాబు తన లేఖలో వెల్లడించారు.

జాతీయ స్థాయిలో నిర్వహించే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి యూపీఎస్సీ పరీక్షల్లో సైతం ఆయా ప్రవేశపరీక్షల్లో వచ్చే మార్కుల ప్రాతిపదికపైనే అభ్యర్థులకు అవకాశముంటుంది తప్ప క్వాలిఫైయింగ్ పరీక్షల మార్కులకు వెయిటేజీ లేదన్న అంశాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదాహరించారు. మరి జేఈఈ(మెయిన్స్, అడ్వాన్స్‌డ్) పరీక్షలకు మాత్రం ఇంటర్ లేదా ప్లస్ టూ వెయిటేజీ ఎందుకని ప్రశ్నించారు. కొత్త విధానాన్ని రద్దు చేయాలని, జేఈఈ(మెయిన్స్, అడ్వాన్స్‌డ్) పరీక్షల్లో వచ్చిన మార్కుల ప్రాతిపదికనే సీట్లను కేటాయించాలని చంద్రబాబు కేంద్రానికి విఙ్ఞప్తి చేశారు.