June 23, 2013

చంద్రబాబు ఉత్తరాఖండ్ పర్యటన


హైదరాబాద్, జూన్ 23 : ఉత్తర కాశీ యాత్రకు వెళ్ళి, అక్కడ కురిసిన భారీ వర్షాలకు చిక్కుకున్న యాత్రికులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉత్తరాంఖండ్ వెళ్లనున్నారు. ఆదివారం మధ్యాహ్రం ఢిల్లీ బయలుదేరి వెళతారు అక్కడ ఏపీ భవన్‌లో సహాయం పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి ఉత్తరాఖండ్ బయలుదేరి వెళతారు. ఈ నేపథ్యంలో అక్కడి ఏపీ రెసిడెంట్ కమిషనర్‌తో చంద్రబాబు మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆదివారం ఉదయం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఇంత విపత్తు ఎప్పుడు జరగలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. వారం రోజులుగా యాత్రికులు తిండి తిప్పలు లేక, స్వస్థలానికి చేరుకుంటామోలేదోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న బాధితులకు సరైన సహాయం అందడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లి బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు..

ఉత్తరాఖండ్‌లో ఆర్మీ సేవలు అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మందులతో సహా డాక్టర్స్‌ను ఉత్తరాఖండ్‌కు పంపిస్తున్నట్లు చెప్పారు. వరదల్లో మృతి చెందినవారికి సంతాపం తెలుపుతూ, వారికి కుటుంబాలకు చంద్రబాబు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.