May 30, 2013

బడుగుల ‘దేశం’

బడుగు, బలహీనవర్గాలకు వేదిక తెలుగుదేశం అని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుండి బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాతే రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా గుర్తింపు లభించిందని గుర్తు చేశారు. ఈ సారి ఎన్నికల్లో బీసీలకు ఖచ్చితంగా100 సీట్లు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. బీసీలకు 100 సీట్లు ఇస్తామని ముందే ప్రకటించిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనన్నారు. గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌ బీసీ మహాసభ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ నేతృత్వంలో ప్రతినిధి బృందం టీడీపీ అధినేత చంద్రబాబును కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బీసీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అభివృద్ధి చేయడానికి నిర్ధిష్ట ప్రతిపాదనతో తాము బీసీ డిక్లరేషన్‌ ప్రకటించామని గుర్తు చేశారు.

బీసీ డిక్లరేషన్‌ను తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చుతామని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుండి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, ఈసారి కూడా అదే పద్దతిలో అన్ని సామాజిక వర్గాలకు టికెట్లు ఇచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు లభించాలన్నది తమ పార్టీ అభిప్రాయమని, అందుకే చట్టసభల్లో మూడవ వంతు టికెట్లు బీసీలకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమలయితే బీసీల రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. అంతకంటే ముందే ఆచరణలో చేసి చూపించాలని టీడీపీ భావిస్తోందన్నారు. బీసీ కులాలను ఆర్ధికంగా రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు టీడీపీ అంకితభావంతో కృషి చేస్తోందన్నారు. అందుకే వారికి 100 టికెట్లు, 10 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. బీసీలకు టీడీపీ మొదటి నుండి ప్రాధాన్యతనిస్తోందని, అలాగే బీసీలు సైతం టీడీపీకి దన్నుగా నిలిచారన్నారు. ఈ సారి టీడీపీ గెలుపు కోసం బీసీలు ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. టీడీపీ ప్రవేశపెట్టిన మండలిక వ్యవస్థ ద్వారా బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరిగిందని మహాసభ ప్రతినిధులతో ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కృషి చేయాలని, మరిన్ని టికెట్లు బడుగులకు ఇవ్వాలని వారు చంద్రబాబును కోరారు.