May 30, 2013

యువతకు 33 శాతం సీట్లు

వచ్చే ఎన్నికల్లో జయం మనదేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రేపు జరగబోయే స్థానిక, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యువతకు ప్రకటించిన 33 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. అవసరమైన చోట సీనియ ర్లకు నచ్చ చెప్పి యువతకు సీట్లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. యువత మేధ సంపత్తికి దేశంలో కొదవ లేదని, అవకాశం ఇస్తే ఆదరగొట్టేస్తా రన్నారు. పార్టీలో అందర్ని పరుగెత్తిస్తారని నవ్వుతూ ఆయన వ్యాఖ్యానించారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకా యల విజయ్‌ చేసిన ప్రసంగాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందిం చారు.విజయ్‌కు అవకాశం ఇవ్వగానే ఆహుతులను కట్టిపడేసే విధంగా మాట్లాడగలిగారని, అలాగే యువతకు ఎవరికీ అవకాశామిచ్చిన ఆకట్టుకోగ లరని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎన్టీరామారావు యువతకు అవకాశాలిచ్చి ప్రోత్సాహించా రన్నారు. ప్రస్తుత టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు చిన్న వయస్సులోనే రాజకీయావకాశమిచ్చి ప్రోత్సాహించింది ఎన్టీ రామారావేనని గుర్తు చేశారు. అప్పటికింకా ఆయనకు పెళ్లికూడా కాలేదన్నారు.ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత యువత భుజస్కంధాలపైనే ఉందన్నారు. ఎన్టీఆర్‌ క్రమశిక్షణకు మారుపేరని, ఆయన ఏ పనినైనా చిత్తశుద్ధితో చేసేవారన్నారు. సినీరంగంలో, రాజకీయరంగంలోనూ అదే క్రమశిక్షణతో పనిచేసి ఉన్నతశిఖరాలు అధిరోహించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ఒక యుగపురుషుడు, ఎందరికో రాజకీయ జీవితాన్ని ఇచ్చారన్నారు. ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. ఎన్టీరామారావు హయాంలో వైద్యులు, న్యాయవాదులు, విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చారన్నారు.

ఈ రోజు నేరస్థులు రాజకీయాల్లోకి అడుగిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఫ్లెక్సీల రగడ ఎందుకు వచ్చింది...ఎన్టీఆర్‌ బొమ్మను ఫ్లెక్సీల్లో పెట్టుకుంటున్నారని...అది కూడా దోపీడీ దొంగల సరసన మహానుభావుడు ఎన్టీరామారావు బొమ్మ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇది చూస్తుంటే బాధేస్తోందన్నారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నవారి పక్కన ఎన్టీఆర్‌ బొమ్మ పెడితే ఎలా సహించామంటారంటూ శ్రేణులను ప్రశ్నించారు. దీనిపైనే మా బాధ, ఆవేదన వ్యక్తం చేశామన్నారు.