May 30, 2013

టీడీపీ బీసీల పార్టీ : చంద్రబాబు

'తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకు రాజకీయంగా గుర్తింపు వచ్చింది. బీసీలకు ఈసారి ఎన్నికల్లో వంద సీట్లు ఇస్తామని ప్రకటించిన ఏకైక పార్టీ టిడిపి' అని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ బీసీ మహాసభ ప్రతినిధి బృందం ఆయనను కలిసి తమ సమస్యలపై మాట్లాడింది. మహాసభ అధ్యక్షుడు అవ్వారు మల్లిఖార్జున్ ఆధ్వర్యంలో ఈ బృందం వచ్చింది.

చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పనకు చొరవ తీసుకోవాలని, రాబోయే ఎన్నికల్లో బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వాలని ఈ బృందం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. బీసీలను సామాజికంగా, రాజకీయంగా ఆర్ధికంగా పైకి తేవడానికి నిర్దిష్ట ప్రతిపాదనలతో తాము ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ విడుదల చేశామని, బీసీలకు వంద సీట్లు...పది వేల కోట్ల నిధులతో ఈ డిక్లరేషన్ రూపొందిందని చంద్రబాబు వారికి చెప్పారు. ఈ డిక్లరేషన్‌ను తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా చేరుస్తామని ఆయన వారికి చెప్పారు. 'తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఈసారి ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాల వారికి టిక్కెట్లు ఇవ్వడానికి మేం ప్రయత్నం చేస్తున్నాం.

బీసీలకు వారి జనాభా దామాషాలో టిక్కెట్లు లభించాలన్నది టిడిపి కోరిక. చట్టసభల్లో రిజర్వేషన్లు లభిస్తే బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది. అవి వచ్చేలోపే మా పార్టీ తరపున మొత్తం సీట్లలో మూడో వంతు టిక్కెట్లు బీసీలకు ఇవ్వాలని మేం నిర్ణయించుకొన్నాం. గెలిచే అభ్యర్ధులు ఎవరైనా ఉంటే మీరు కూడా మాకు సూచించండి. మేం తప్పక పరిశీలిస్తాం' అని ఆయన వారితో అన్నారు. ఆర్దికంగా బీసీ కులాల వారిని పైకి తేవాల్సిన అవసరం ఉందని, అందు కోసమే రూ. పది వేల కోట్లతో ప్రత్యేకంగా బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలన్నది తమ పార్టీ ఆలోచన అని ఆయన వారితో చెప్పారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బీసీలకు బాగా ప్రాధాన్యం ఇస్తోందని, మండల వ్యవస్ధను టిడిపి తేవడంతో కింది స్ధాయి నుంచి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగిందని బీసీ మహాసభ ప్రతినిధులు ఆయనతో అన్నారు.