May 30, 2013

దేశంలో 'మహా' జోష్‌!

 తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 32వ 'మహానాడు' ముగిసింది. ఊహించని రీతిలో 13వేల మంది ప్రతినిధులుగా పేర్లు నమోదు చేయించుకున్నారు. ఇంకా నమోదు చేసుకోని వారి సంఖ్య ఇథమిద్దంగా తెలియడం లేదు. వారు కూడా గణనీయ సంఖ్యలో ఉంటారని టీడీపీ కార్యాలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో నిర్వహించే మహానాడుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని తొలి నుంచి అధినేత చంద్రబాబు నాయుడు చెప్తూ వచ్చారు. అదే రీతిలో సమావేశంలో ఏకంగా 14తీర్మానాలు చేశారు. ఎన్నికల సంవత్సరానికి శ్రేణులను సిద్ధం చేసే దిశలో 75శాతం పనిని పూర్తి చేశారు. అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు అంతులేని ఆత్మ విశ్వాసం నూరి పోశారు. గెలుపు లక్ష్యంగా ముందుకు సాగండి. ఎన్ని అవాంతారాలు ఎదురైనా సరే! అన్నింటికి నేనున్నాను. అన్ని విధాలా ఆదుకుంటాను అని వారికి భరోసా ఇచ్చారు. దేవుడిచ్చిన శక్తి ఉడిగిపోయేదాకా పని చేస్తాను అంటూ యువతను ఆకర్షించారు. తొలిసారిగా ఆయన కార్యకర్తల రుణం తీర్చుకుంటానని చెప్పారు.

గెలుపుపై ధీమా

అధికారానికి దూరమైన ఆ పార్టీ శ్రేణులు ఒకింత నిర్వేదంలోనే ఉన్నాయి. ఆ క్రమంలోనే చంద్రబాబు సుదీర్ఘ పాద యాత్ర ప్రారంభించారు. ఆయన యాత్ర కొనసాగిన ప్రాంతాల్లో మార్పు స్పష్టంగానే కన్పించింది. ఇక మహానాడుకు వచ్చిన అనూహ్య జన స్పందన అధినేతకు ఆనందాన్ని ఇచ్చింది.

'యువ మంత్రం'

ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్‌ చేరిక రోజే రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పిన చంద్రబాబు మహానాడు వేదికగా యువత హృదయాలను కొల్లగొట్టేందు చేసిన ప్రయత్నం ఏ మేరకు విజయవంతం అయిందనేది మరి కొన్ని రోజులు వేచి చూస్తేగానీ తెలియదు. చింతకాయల విజయ్‌, టి. వీరేంద్రగౌడ్‌, కింజరపు రామ్మోహన్‌ రావు లాంటి యువకుల సరసన కుమారుడు లోకేష్‌ను సభికుల్లో కూర్చోపెట్టడం ద్వారా విమర్శలకు బదులు చంద్రబాబు కోరుకునే ప్రచారాన్ని పుష్కలంగా పొందారు.