May 21, 2013

తెలుగుదేశం గూటికి మంత్రి సోదరుడు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి: రాష్ట్ర మంత్రి మహ్మద్‌ అహ్మదుల్లా సోదరుడు మహ్మద్‌ ఇనయతుల్లా మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలోనే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఒకప్పటి పీసీసీ అధ్యక్షులు మహ్మద్‌ రహమతుల్లా కుమారులే అహ్మదుల్లా, ఇనయతుల్లాలు. రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్‌, పూర్వ ఎమ్మెల్సీ పుత్తా నర్సింహారెడ్డితో కలిసి ఆయన చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆయనతో పాటు కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేతలు కరీముల్లా మహబూబ్‌, బాషా, హాజీబాబు తెలుగుదేశం పార్టీలో చేరారు.

అదేబాటలో మరికొందరు..

టీడీపీలో చేరేందుకు వేర్వేరు పార్టీలకు, సంస్థలకు చెందిన మరి కొందరు నేతలు లైన్‌లో ఉన్నట్లు ఆ పార్టీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగానే టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత, మాజీ ఎంపీ చాడ సురేష్‌ రెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన మల్కాజ్‌గిరి నుంచి లోక్‌సభ సీటును ఆశిస్తున్నారు. అలాగే సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు చెందిన బీజేపీ నేత మురళి సైతం త్వరలో టీడీపీలో చేరనున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఓయూ జేఏసీలో కీలక భూమిక పోషించిన నేతలు రాజారాం యాదవ్‌, పిడమర్తి రవి సైతం త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వారిలో రాజారాం నిజామాబాద్‌ జిల్లాలోని బాల్కొండ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. అదే విధంగా పిడమర్తి రవి ఖమ్మం జిల్లాలోని మధిర సీటును కోరుతున్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి మేడ్చల్‌లో పార్టీ అభ్యర్థిత్వం కట్టబెట్టిన పక్షంలో చేరేందుకు సిద్ధమని 'దేశం' నేతలకు సంకేతాలు పంపినట్లు తెలిసింది. అధినేత చంద్రబాబు నాయుడు సైతం వారి ఆకాంక్షల పట్ల సానుకూలంగా ఉన్న నేపథ్యంలో త్వరలోనే వారంతా సభ్యత్వం స్వీకరించవచ్చు. ఈ పరిణామాలతో 'దేశం' శిబిరంలో ఉత్సాహం నెలకొంది.