May 22, 2013

నల్లధనాన్ని నియంత్రించాలి: చంద్రబాబు


హైదరాబాద్ : నల్లధనాన్ని నియంత్రణ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. నల్లధనాన్ని అరికడితేనే దేశాభివృద్ధి జరుగుతుందని ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన బుధవారమిక్కడ తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నగదు వ్యవహారాలు బ్యాంకుల ద్వారా జరిపితే నల్లధనాన్ని అరికట్టవచ్చన్నారు.

దేశంలోని 1000, 500 రూపాయిల నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కరెన్సీలో 33 శాతం వెయ్యి రూపాయిల నోట్లే ఉన్నాయని ఆయన అన్నారు. దేశంలో రూ.70 లక్షల కోట్ల నల్లధనం ఉందనే అంచనా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

అవినీతి రహిత భారతదేశం ఏర్పడేవరకూ పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. నల్లధనం చివరకు క్రీడల్ని కూడా శాసిస్తోందని బాబు వ్యాఖ్యానించారు. తాము ప్రతిపాదించిన నగదు బదిలీ పధకాన్ని కాంగ్రెస్ నకిలీ బదిలీగా మార్చిందని ఆయన విమర్శించారు.