May 22, 2013

నల్లధనాన్ని నియంత్రించాలి అవినీతి రహిత భారత్ కోసం పోరాటం: చంద్రబాబు

కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారుపై తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. యూపీఏ పాలన అంతా అవినీతిమయంగా మారిందని ఎద్దేవా చేసింది. ప్రభుత్వం అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. తాము ప్రతిపాదించిన నగదు బదిలీ పథకాన్ని నకిలీ బదిలీ పథకంగా మార్చారని మండిపడ్డారు. నల్లధనాన్ని అరికడితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుతం జైలులో కూర్చొని రాజకీయం చేసే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి రహిత, అక్రమాల రహిత భారత్ కోసం తాము పోరాడుతామని ప్రకటించారు. బుధవారం చంద్రబాబు తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. యూపీఏ హయామంతా కుంభకోణాల మయమని ఎద్దేవా చేశారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీస్తే సామాన్యుడి జీవితం ఎంతో మెరుగుపడుతుందన్నారు. ప్రస్తుతం జైలులో కూర్చొని రాజకీయాలు చేసే పరిస్తితి వచ్చిందన్నారు. జైలు నుంచే సెటిల్మెంట్‌లో చేసే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. వెయ్యి రూపాయల నోట్లు, రూ.500 నోటల మూలంగా చాలా అనర్థాలు వస్తున్నాయని, అవి ముద్రించగానే.. నల్లధనంగా మారుతున్నాయని, విదేశాలకు వెళ్లిపోతున్నాయన్నా రు. ఆడబ్బతోనే అరాచకం, అవినీతి, అశాంతి వంటివి ఏర్పాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నిరోధించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. గతంలో అమెరికాలోనూ ఇదే పరిస్థితి దాపురిస్తే.. 1969లో నిక్సన్ వంద డాలర్ల నోట్లను రద్దు చేశారని, దీంతో నల్లధనం సమస్య పోయిందన్నారు. మన దేశంలోనూ ఈ సమస్య పోవాలంటే రూ1000, రూ.500 నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో రూ.70 లక్షల కోట్ల నల్లధనం ఉందని అంచనా అని, అవినీతి మొత్తం ఇంకా ఎక్కువగానే ఉంటుందన్నారు. అలాగే నేరస్తులు సెటిల్మెంట్లు చేస్తున్నారని, చివరకు క్రీడలను కూడా అక్రమ లావాదేవీలకు వాడుకుంటున్నారని, యువత జీవితాలతో ఆడుకుంటున్నారని వాపోయారు. వీటన్నిటిపైనా చర్చించడానికి అర్ధక్‌రాంతి సంస్థ వారు కసరత్తు చేస్తున్నారని, వారితో తాను మాట్లాడానని చెప్పారు. దీనిపై త్వరలోనే చర్చ చేపట్టాలని భావిస్తున్నామని తెలిపారు. మన కరెన్సీలో 33 శాతం రూ.1000 నోట్లు ఉన్నాయని, 49 శాతం రూ.500 నోట్లు, మిగతావి రూ.100 కన్నా తక్కువగి ఉన్నానయన్నారు. రూ.500, రూ.1000 నోట్లు కేవలం డబ్బున్న వారికి, నేరప్రవృత్తి ఉన్న వారికే ఉపయోగపడుతున్నాయని, అందుకే వాటిని నియంత్రించాలని తెలిపారు. బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరపాలని, పెద్దనోట్లను రద్దు చేస్తే అవినీతి, నల్లధనం తగ్గుతుందన్నారు. జగన్ కేసులో ఆర్థిక నేరాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిందని.. వీటిని సీరియస్‌గా పరిగనించాలని చెప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అవినీతిపై మహానాడులో ఒక విధానం రూపొందించడానికి యత్నిస్తామన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చకు పెట్టి, కేంద్రంపై కూడా ఒత్తిడి తెస్తామన్నారు. అవినీతి రహిత భారత్‌ను తయారు చేసేందుకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.