May 21, 2013

జగన్ పార్టీకి ఉలుకెందుకు : పయ్యావుల

 నాయకుడు లేని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆత్మరక్షణలో పడిందని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ మంగళవారం అన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెసుతో కలిసే ప్రసక్తే లేదన్నారు. తమ పార్టీ పుట్టిందే కాంగ్రెసు పార్టీ వ్యతిరేక పునాదుల పైన అన్నారు. ఆత్మరక్షణలో పడిన జగన్ పార్టీ తమపై నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు.

తాము అవినీతి పైన ఇప్పుడే పోరాటం ప్రారంభించలేదని వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుండే పోరాడుతున్నామన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలని కోరితే జగన్ పార్టీ ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు. తాము జగన్ పార్టీ పుట్టినప్పటి నుండి అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించలేదన్నారు.

ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిలు మంత్రివర్గం పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ధర్మాన కేబినెట్‌ను తప్పు దోవ పట్టించారనే అభియోగాలు ఉన్నాయన్నారు. సబితకు తెలిసే క్యాప్టివ్ పదం తొలగించబడిందని ఆయన ఆరోపించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో తన కుటుంబ సభ్యుల పేర ఉన్న విల్లాల పేర్లను ధర్మాన బయటపెట్టగలరా అని ప్రశ్నించారు. తాను అమాయకుడిని అని చెప్పే ముందు ధర్మాన తన ఆస్తుల వివరాలు బయటపెట్టాలన్నారు.

కచ్చితంగా వారిని తాము కళంకింత మంత్రులుగానే చూస్తామన్నారు. కళంకింత మంత్రులు అసెంబ్లీలో సమాధానం చెప్పినా తాము వినే ప్రసక్తే లేదన్నారు. వారివి జైల్ కాంగ్రెసు, బెయిల్ కాంగ్రెసులు అని ఎద్దేవా చేశారు. కళంకిత మంత్రులను తొలగించే వరకు ఉద్యమిస్తామన్నారు. ఓబుళాపురం మైనింగ్ పైన తాము మొదటి నుండి పోరాటం చేస్తున్నామన్నారు. అవిశ్వాసం విషయంలో తాము కడియం శ్రీహరియో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీయో చెబితే వినమన్నారు. ఏం చేయాలనేది తమ పార్టీ నిర్ణయిస్తుందన్నారు.