April 1, 2013

బస్సులో చంద్రబాబు ప్రపంచాన్ని చూస్తారు

కాకినాడ సిటీ:ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వస్తున్నా.. మీకోసం అంటూ పాదయాత్రలో చంద్రబాబు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ప్రజల ముందు ఉంచి ఎండగడుతున్నారు. ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యవంతులుగా మారుస్తున్నారు. పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా ప్రవేశించడంతో ప్రజల్లో ఉత్సాహం వచ్చినట్లయింది. చంద్రబాబు 181 రోజుల పాదయాత్రలో రెండు ఆదివారాల్లో మాత్రమే విశ్రాంతి తీసుకున్నారు. కాకినాడలో ఆనంద భారతి గ్రౌండ్‌లో తీసుకున్న విశ్రాంతి రెండోది.

పాదయాత్ర ప్రారంభం దగ్గర నుంచి ముగింపు వరకు అలుపెరగని బాటసారిలా నడుస్తూ పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరుస్తూ ముందుకు సాగుతున్నారు. శనివారం అర్ధరాత్రి ఒంటి గంటకు కాకినాడ ఆనందభారతి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బస్సులో ఆయన బస చేశారు. ఆదివారం విరామం కావడంతో బస్సులో చంద్రబాబు ఏం చేస్తారు అనే దానిపై ఆయన్ను చూసేందుకు వచ్చిన జనం ఆసక్తిగా చర్చించుకున్నారు. బాబు చేసిన బస వద్ద సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు బస్సులో బాబు దినచర్య ఇలా సాగింది.

బాబు సాధారణ రోజుల్లో ఆరు గంటలకు లేస్తారు. ఆదివారం మాత్రం ఉదయం 7.30 గంటలకు నిద్రలేస్తారు. కాలకృత్యాలు తీర్చుకుంటారు. వ్యాయామం, యోగా చేస్తారు. 9 గంటలకు పాదయాత్రకు సంబంధించిన వార్తల విషయాలతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను, దేశ రాజకీయాలను పత్రికల ద్వారా నిశితంగా పరిశీలిస్తారు. 10.30 గంటలకు టీవీ చూస్తారు. వాటి ద్వారా వచ్చే విషయాలను పరిశీలించి జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటారు. ఈ మేరకు జాతీయస్థాయి నాయకులతో మాట్లాడతారు.

అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై నిశితంగా పరిశీలించి పార్టీ విధానాలను పార్టీ శ్రేణులకు టెలీకాన్ఫెరెన్స్ ద్వారా నేతలకు వివరిస్తారు. రెండుగంటలపాటు ఈ అంశాలు సాగుతాయి. 12.30 గంటల నుంచి 2 గంటల వరకు కుటుంబ సభ్యులతో గడుపుతారు. రెండు గంటలకు భోజనం చేస్తారు. గంట విరామం అనంతరం మళ్లీ కుటుంబ సభ్యులతో గడుపుతారు. అనంతరం పాదయాత్రలో కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి నాయకులకు సూచనలు, ఏర్పాట్లపై సమీక్ష చేస్తారు.

కేంద్ర, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మరొకసారి టీవీ చానళ్ల ద్వారా తెలుసుకుంటారు. దినచర్య ఇలా ఉంటే ఇటీవల జాతీయస్థాయిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పెదపూడిలో టీడీపీ 32 ఆవిర్భావ దినోత్సవంలో మాజీ ఎంపీ, గుంటూరుకు చెందిన సీనియర్ నేత లాల్‌జాన్ భాష తన ప్రసంగంలో మళ్లీ చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. 33వ ఆవిర్భావ దినోత్సవం ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో బాబు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇందులో భాగంగా జాతీయస్థాయి నేతలతో టచ్‌లో ఉంటున్నారని తెలుస్తోంది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం పెదపూడిలో నిర్వహించడం ఒక చరిత్రగా మిగిలిపోతుందని పార్టీ శ్రేణలు చెబుతుంటే కాకినాడలో సోమవారం నిర్వహిస్తున్న విద్యుత్ దీక్ష ద్వారా ఈ ప్రాంతం టీడీపీ ఉద్యమాల్లో కీలకమైనదిగా గుర్తుండిపోతుందని నేతలు పేర్కొంటున్నారు.