April 1, 2013

కాకినాడలో చంద్రబాబుకు నీరా'జనం'

కాకినాడ రూరల్
టీడీపీ అధినేత చంద్రబాబు మీ కోసం వస్తున్నా పాదయాత్రకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనం అడుగడుగునా నీరాజనం పట్టారు. కొవ్వాడ నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంతో ఉరకలేశారు. పాదయాత్రకు ముందుగా కొవ్వాడలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ పిల్లి సత్తిబాబు, అనంతలక్ష్మి దంపతలతోపాటు, వీవై దాసు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. కొవ్వాడలో నాలుగు గంటలకు ప్రారంభమైన పాదయాత్రలో ముందుగా నాయకులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హాజరైన మహిళలతో స్థానిక సమస్యలపై ఆరా తీశారు. మండలంలో తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని మహిళలు ఏకరువు పెట్టారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ దొంగలు ఉన్న ప్రభుత్వంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజాధనాన్ని దోచుకోవడమే తప్ప ప్రజాసమస్యలు తీర్చేవారు లేరన్నారు. కరెంటు ఉండదు కానీ కరెంటు బిల్లులు మాత్రం వేలకు వేలు చెల్లించే పరిస్థితి దాపురించిందని దుయ్యపట్టారు. అనంతరం చీడిగలోని నాగం సీతామహాలక్ష్మి కల్యాణమండపంలో రూరల్ మండల పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. క్రైస్తవ ఆస్తులను పరిరక్షించేందుకు ప్రత్యేక రక్షణ చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

చీడిగ వంతెన వద్ద మాజీ సర్పంచ్ పితాని అప్పన్న ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేశారు. అక్కడ కూడా స్థానిక సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాకినాడకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం లేక, సొంత ఇళ్లు లేక పేదలు ఇంటి అద్ది చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అప్పన్న బాబు దృష్టికి తీసుకెళ్లారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే పేద వారికి సొంతింటి కల సాకారం చేసేందుకు, తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఇంద్రపాలెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి పూలమాలలు వేశారు. అగ్రహారానికి చెందిన బ్రహ్మణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.