April 1, 2013

కాకినాడలో మెరిసిన లోకేష్ దంపతులు

కాకినాడ సిటీ: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ఆదివారం కాకినాడ వచ్చారు. 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రలో భాగంగా కాకినాడ ఆనందభారతి మైదానంలో బాబు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. లోకేష్, బ్రహ్మణి దంపతులు ఉదయం 11 గంటలకు బస వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ చేరుకుని అక్కడి నుంచి కారులో కాకినాడ వచ్చారు. టీడీపీ కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, నగర శాఖ అధ్యక్షుడు నున్న దొరబాబు లోకేష్ దంపతులను స్వాగతించి ఆత్మీయంగా పలకరించారు.

ఆదివారం యువత సమావేశం జరపాలని నిర్ణయించామని, విద్యుత్ సమస్య ఎక్కువగా ఉండడంతో బాబు ఇచ్చిన పిలుపులో భాగంగా విద్యుత్ ధర్నా చేయాలని కోరారని లోకేష్‌కు కొండ బాబు వివరించారు. అందుకే యువత సభ రద్దు చేశామని చెప్పగా 'విద్యుత్ సంక్షోభంపై నాన్నగారు దీక్ష చేపట్టడం' రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి మేలు చేకూరుతుంది కదా అని కొండబాబుకు బదులిచ్చారు. అనంతరం అక్కడికి చేరుకున్న పలువురికి అభివాదం చేసి బస్సులోకి వెళ్లారు. మధ్యాహ్నం 2.45 గంటలకు బస్సు నుంచి బయటకు వచ్చారు. ఇంతలో యువ నేత ముత్తా శశిధర్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు తదితరులు లోకేష్ రాక కోసం కొద్దిసేపు ఎదురు చూశారు. బస్సులోంచి బయటకొచ్చిన లోకేష్‌కు శశిధర్ పుష్పగుచ్ఛం అందజేశారు. వాసిరెడ్డి ఏసుదాసు టీడీపీ కండువా కప్పారు.

ఇద్దరూ ఆత్మీయంగా పలకరించుకుని అక్కడ ఉన్న సన్నిహితులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను పలకరించారు. అనంతరం లోకేష్‌ను విలేఖరులు మాట్లాడమని కోరగా.. ఇప్పుడు మాట్లాడడం సరికాదు... నాన్నగారి పాదయాత్ర ముగిశాక మాట్లాడతాను అంటూ కారు ఎక్కి అభివాదం చేశారు. బాలకృష్ణ మిత్రుడు జిలానీ బ్రాహ్మణిని ఆత్మీయంగా పలకరించిన అనంతరం వారు విశాఖపట్నం వెళ్లారు.