March 12, 2013

తోక పార్టీల తీర్మానాలకు మద్దతు ఇవ్వొద్దు

తోక పార్టీలకు తలూపొద్దు
వాటి వలలో చిక్కుకోవద్దు
టీఆర్ఎస్ అవిశ్వాసానికి టీడీపీ దూరం
పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
స్థానిక ఎన్నికలకు భయపడే వాటి ఎత్తులు
తగిన సమయంలో సొంతంగానే పెడదాం
అధినేతకు నేతల స్పష్టీకరణ
టీఆర్ఎస్, వైసీపీలది ఒంటెత్తు పోకడ
ముందుగా చర్చించలేదు.. సంప్రదించలేదు
మొక్కుబడిగా లేఖ: చంద్రబాబు

  : రాష్ట్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ప్రతిపాదించదల్చిన అవిశ్వాసాన్ని పట్టించుకోరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. తోక పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం వేసే ఎత్తుగడల్లో చిక్కుకోవాల్సిన అవసరం లేదని, వాటికి రాజకీయంగా లాభం కలిగించడానికి తాము పావులుగా ఉపయోగపడకూడదని ఆ పార్టీ నిశ్చయించింది. ప్రజా సమస్యలు ఎజెండాగా తగిన సమయంలో అవిశ్వాస తీర్మానాన్ని తామే సొంతంగా ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం రాత్రి అక్కడి నుంచే పార్టీ సీనియర్ నేతలు, కొందరు ఎమ్మెల్యేలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

టీఆర్ఎస్ ప్రతిపాదిస్తానని చెబుతున్న అవిశ్వాస తీర్మానంపై ఎటువంటి వైఖరి అవలంబించాలన్న దానిపై చర్చించారు. టీఆర్ఎస్, జగన్ పార్టీలు లోపాయికారీ అవగాహనతో తమ రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని ముందుకు తెస్తున్నాయని, వాటి వలలో తాము పడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం ఈ సందర్భంగా వ్యక్తమైంది. తుమ్మల నాగేశ్వరరావు వంటి కొందరు సీనియర్ నేతలు కుండ బద్దలు కొట్టినట్లు తమ అభిప్రాయం తేల్చి చెప్పారు. "టీఆర్ఎస్, వైసీపీలు రెండూ ఇటీవలి సహకార ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే వాటిలో కూడా తమకు అవే ఫలితాలు వస్తాయని ఆ పార్టీలకు భయం పట్టుకొంది. వాటిని అడ్డుకోవడానికి ఇప్పుడు ఆ రెండూ కలిసి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి పడగొట్టాలని ప్రయత్నిస్తున్నాయి. వాటి రాజకీయ అవసరాలు, వ్యూహాలకు ఉపయోగపడాల్సిన ఖర్మ మనకు పట్టలేదు. అసెంబ్లీలో మన సంఖ్యా బలంతో పోలిస్తే అవి రెండూ మనకు తోక పార్టీలు. తోక ఆడించినట్లు మనం ఆడలేం. వాటిది రాజకీయ కోణం. మనది ప్రజా సమస్యల కోణం. అవి తమ మనుగడ కోసం పోరాటం చేస్తున్నాయి. మనం ప్రజల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నాం. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తగిన సమయంలో మనమే అవిశ్వాస తీర్మానం సొంతంగా ప్రతిపాదిద్దాం.

తోక పార్టీలు పెట్టే అవిశ్వాస తీర్మానాలకు మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు'' అని వారు తేల్చి చెప్పారు. టెలి కాన్ఫరెన్సులో పాల్గొన్న వారిలో అత్యధికులు ఈ అభిప్రాయాన్ని సమర్థించారు. "ఇంత కీలకమైన అంశంలో రాజకీయ నిర్ణయం తీసుకొనేటప్పుడు ముందుగా అందరితో సంప్రదింపులు జరుపుతారు. టీఆర్ఎస్, వైసీపీ ఇంతవరకూ మనను సంప్రదించలేదు. మనతో చర్చించలేదు. అవిశ్వాసం పెడతామని ముందుగా విలేకరుల సమావేశంలో ప్రకటించి తర్వాత అర్ధరాత్రి సమయంలో మన పార్టీ కార్యాలయానికి కవర్లో పెట్టి ఒక లేఖ పంపారు. నేను ఇక్కడ పాదయాత్రలో ఉన్నానని తెలిసీ పార్టీ కార్యాలయానికి మొక్కుబడిగా ఒక లేఖ పంపి చేతులు దులుపుకొన్నారు. ఒంటెత్తు పోకడగా వ్యవహరించడం తప్ప రాజకీయ విజ్ఞత ఎక్కడా కనిపించడం లేదు'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అల్లుడు అనిల్‌పై తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలతో అతను కూడా సీబీఐ దర్యాప్తులో ఇరుక్కొంటాడన్న భయం వైసీపీ నేతలను ఆవరించిందని, ప్రభుత్వం పడిపోతే తప్ప దీనిని ఆపలేమని వారు భావిస్తున్నారని మరో ఎమ్మెల్యే చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి అవిశ్వాస తీర్మానం ఒక అంశమే తప్ప అదొక్కటే మార్గం కాదని, అసెంబ్లీలో చర్చలు.. బయట ప్రజలను కూడగట్టి పోరాటం చేయడం వంటి అన్ని రకాల మార్గాలను రాజకీయంగా వినియోగించుకోవాలని మరికొందరు నాయకులు అన్నారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారని ఆయా పార్టీలు విమర్శించే అవకాశం ఉందని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సందేహం వ్యక్తం చేశారు.

"ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని వైఎస్ విజయలక్ష్మి బహిరంగంగా ప్రకటించారు. కాంగ్రెస్‌లో తమ పార్టీని విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ అనేకసార్లు చెప్పారు. వాళ్లు మనల్ని అనేదేమిటి? ఆ రెండు పార్టీలు టీడీపీ ఎమ్మెల్యేలకు వల విసిరి వలసలు ప్రోత్సహించి మన పార్టీని బలహీనపర్చాలని ప్రయత్నం చేశాయి. మనను దెబ్బకొట్టాలని చూసిన పార్టీలకు మనం మద్దతు ఇచ్చేదేమిటి? అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో మన నిర్ణయం మనం తీసుకొందాం. మే వరకూ సమావేశాలున్నాయి. ఎప్పుడు ఎలా పెట్టాలో మనం ఆలోచించుకొని నిర్ణయం తీసుకొందాం'' అని సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ముద్దు కృష్ణమ నాయుడు వంటివారు తేల్చి చెప్పారు.