March 12, 2013

సాక్షికాదు..అసత్యాల పుట్ట

భీమవరం/పాలకోడేరు/వీరవాసరం: 'సాక్షి పత్రిక విషకన్య.. అది సాక్షి కాదు అసత్యాల పుట్ట.. రోజూ నాపై ఒక పేజీ రాస్తేగా నీ దానికి గడవని పరిస్థితి. దొంగలు పెట్టిన టీవీ, పేపర్ అది'... అంటూ సాక్షి పత్రికపై చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. త మ కుటుంబంలో ఎన్టీయార్, తాను 17 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రులుగా పనిచేశామని, తాము టీవీ కానీ, పేపర్ కానీ పెట్టలేదన్నా రు. 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా పాలకోడేరు మండలం శృంగవృక్షం బస్టాండ్ సెంటర్‌లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భీమవరం ఇంజనీరింగ్ విద్యా ర్థి ఒకరు మీరూ పేపర్, టీవీ పెట్టవచ్చుకదా అన్నాడని, సాక్షి లాంటి పేపర్, టీవీలను దొంగలే పెట్టగలరని, తనకు పెట్టే ఉద్దేశ్యం లేదని చెప్పారు. ప్రజా సేవ చేయడమే తన లక్ష్యం అని చెప్పారు.

మొన్నటి వరకు రాయలసీమ పౌరుషం, పులవెందుల పోరాటం రాజీలేని వైఖరి అం టూ ప్రగల్భాలు పలికిన పిల్ల కాంగ్రెస్ ఇప్పు డు తల్లికాంగ్రెస్‌లో కలిసిపోతుందన్నారు. ఇప్పుడు పొత్తు పేరుతో ఆ పార్టీలో కలవడం ఖాయమన్నారు. ఇలాంటి పార్టీలను ప్రజలు ఎన్నో చూశారన్నారు. నీలం సంజీవరెడ్డి, చిరంజీవి వంటి వారు సొంత పార్టీలను పెట్టి ఇలా ప్రగల్భాలు కలిపి చివరికి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారని విమర్శించారు. అటువంటి వారిని నమ్మవద్దన్నారు.

రాష్ట్రం అథోగతి పాలవుతోందని, తొమ్మిదేళ్ళుగా దొంగలు దొరికిన కాడికి దోచుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. ఈ పరిస్థితికి గతంలో రాజశేఖర్‌రెడ్డి, ఇప్పుడు కిరికిరి కిరణ్‌కుమార్‌రెడ్డిలు కారణమని విమర్శించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సాగునీరు ఇవ్వలేకపోతున్నాడు, ధరలు అదుపు చేయలేకపోతున్నాడు, కరెంటు ఇవ్వలేకపోతున్నాడు.. ఇటువంటి అసమర్థ పాలన వల్ల ప్రజలు కష్టాల్లో పడ్డారన్నారు. వేలకోట్లు తిన్నవారందరూ జైల్లో ఉన్నారని, కొంతమంది మంత్రులు, రేపో మాపో జైలుకు వెళ్ళతారన్నారు. కిరణ్‌కుమార్ తన క్యాబినెట్ సమావేశాన్ని చంచల్‌గూడ జైల్లో పెట్టాల్సిందేని ఎద్దేవా చేశారు.