March 12, 2013

'జగన్' భక్తులకు చంచల్‌గూడే గుడి

ఏం తెలుసని వీళ్లకు పదవులు?
దొంగ డబ్బుల జగన్
అమ్మ చాటున రాహుల్
జిల్లా నేతగా కొరగానివారూ సీఎంలేనా?
పశ్చిమ యాత్రలో చంద్రబాబు ఎద్దేవా



'సోనియాగాంధీ..తన కొడుకు రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలనుకుంటున్నారు. విజయలక్ష్మి.. జగన్‌ని సీఎంను చేస్తామని చెబుతున్నారు. అసలు వీళ్లిద్దరికీ ఏం రాజకీయ అనుభవం ఉంది? అమ్మమాటన రాహుల్‌గాంధీ ఉంటే,దొంగ డబ్బులు పోగేసుకున్న జగన్ ఇంకోవైపు పదవులను ఆశిస్తున్నారు' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జిల్లా కాంగ్రెస్ నాయకుడిగా అనుభవం లేదుగానీ, సీఎం పదవి కోసమే పార్టీ పెట్టారట.. అంటూ వైసీపీ అధినేత జగన్‌ను దుయ్యబట్టారు. సబ్జెక్టు తెలియదుగానీ ఫోజులు కొడుతున్నారని సీఎం కిరణ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పెన్నాడ వద్ద మంగళవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు.

శృంగవక్షం, నందమూరు గర్వు, వీరవాసరం, ఎస్ చిక్కాల, దగ్గులూరు, లంకలకోడేరు, వెలియలఅడ్డరోడ్డు, బగ్గేశ్వరం, పూలపల్లి మీదుగా నడిచారు. శృంగవృక్షం వద్ద ఒక పేద ఇంటికి వెళ్లి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ రోడ్డుపక్కన చేపలు అమ్ముతున్న వారిని పలకరించారు. హైస్కూల్‌లో పదవ తరగతి చదివే విద్యార్థులను కలిశారు. మార్గమధ్యలో కలిసిన గౌడ కులస్తులను భుజం తట్టి ముందుకు నడిచారు. రోడ్డుపక్కన నిలిపిన బజ్జీల బడ్డీ దగ్గరకు వెళ్లి.. ఒక బజ్జీ తిని రెండు వేలు ఇచ్చారు. శృంగవృక్షంలో జరిగిన సభలో జగన్, కిరణ్‌ల తీరును తూర్పారబట్టారు.

"ఈ సీఎం చాలా దుర్మార్గుడు. వైఎస్ తన హయాంలో టీడీపీ కార్యకర్తలను హత్యలు చేయించగా, కిరణ్ మా పార్టీనేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నా''రంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్ల కాంగ్రెస్‌గా తాను పిలిచే జగన్ పార్టీ.. జైలు పార్టీ కూడానని పేర్కొన్నారు. "ఎవరైనా గుడికి వెళ్లి కొబ్బరికాయ కొడతారు. కానీ, పదవులు కోరుకుంటున్న వారికే చంచల్‌గూడ జైలే గుడిగా మారింది. అక్కడే కొబ్బరికాయలు కొట్టి,లోపలకు వెళ్లి జగన్‌కు పూజలు చేస్తున్నారు'' అని ఎద్దేవా చేశారు.

"జగన్ సీఎం అవుతారు. రాజన్న సువర్ణ యుగం తిరిగి తీసుకొస్తారు'' అంటూ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుబట్టారు. "వైఎస్ హయాంలో సాగింది స్వర్ణయుగం కాదు. అదో అరాచక కాలం. ర్రాష్టంలో కష్టాలకు అప్పుడు వైఎస్, ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డే కారణం'' అని మండిపడ్డారు. అనంతరం దెందులూరు, నిడదవోలు నియోజకవర్గాల కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. అబద్ధాల, విషకన్యగా జగన్ పత్రికను అభివర్ణించారు.