February 16, 2013

వైఎస్ వ్యవసాయాన్ని పతనం వైపు నడిపిస్తే.. కిరణ్ అంతమే చేస్తున్నాడు

కాలవల్లో రైతుల కన్నీరు
పొరుగు రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోని ఫలితం
కాంగ్రెస్ పాలనలో 22,500 మంది రైతుల బలవన్మరణం
రైతు రాజ్యం తీసుకురావడమే ఆశయం
ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి
గంటూరు జిల్లా పాదయాత్రలో బాబు

ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇస్తానంటూ మాయ మాటలు చెప్పి, నీటిపారుదల వ్యవస్థను నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. "కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆల్మట్టి, బాబ్లీ ప్రాజెక్టులు కడుతున్నా అడ్డుకోలేకపోయారు. ఫలితంగా నేడు పైనుంచి కిందికి నీరు రాక, సాగునీటి కాలువల్లో రైతుల కన్నీళ్లు పారుతున్నాయి'' అంటూ చంద్రబాబు వైఎస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జలయజ్ఞం పేరుతో వైఎస్ రూ.30 వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు.

కాంగ్రెస్ తొమ్మిదేళ్ల పాలనలో 22,500 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే.. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే 14,500 మంది ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. అన్ని విధాలుగా చితికిపోయిన రైతులను గట్టెక్కించేందుకు సర్వశక్తులు ఒడ్డుతానని వాగ్దానం చేశారు. చంద్రబాబు 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర శనివారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని అంగలకుదురులో ప్రారంభమైంది. తన పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటిన సందర్భంగా ఈదర భాస్కరరావు అనే రైతు విరాళంగా ఇచ్చిన స్థలంలో టీడీపీ తరఫున 'ఎన్‌టీఆర్ కిసాన్ భవన్' నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రైతులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ కష్టాలను ఆయనకు మొరపెట్టుకున్నారు.

రుణమాఫీ చేసి తీరుతా
ఎంత కష్టమైనా రైతులకు రుణమాఫీ అమలు చేసి తీరతానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. తన హయాంలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకువచ్చిన విషయం గుర్తు చేశారు. వ్యవసాయాన్ని ఒక పద్ధతిలో పతనావస్థ దిశగా వైఎస్ నడిపిస్తే ప్రస్తుత సీఎం కిరణ్ దానిని పూర్తిగా అంతం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారరు. అందరూ కలిసికట్టుగా రైతు వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యాన్ని పోగొట్టి రైతురాజ్యం తీసుకురావడమే తన ఆశయమన్నారు. రైతులతో సమావేశంలో మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు జోరు వానను సైతం లెక్కచేయకుండా ప్రజల సమస్యలు తెలుసుకొంటూ పాదయాత్రలో ముందుకు సాగిపోయారు.

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రౌడీలు రాష్ట్రం విడిచి పారిపోయేలా చేశామని చంద్రబాబు చెప్పారు. వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పాదయాత్రలో భాగంగా తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాల విద్యార్థినులతో చంద్రబాబు సంభాషించి వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించాల్సిందేనని స్పష్టం చేశారు. బాగా చదువుకోవడం కోసమే ల్యాప్‌టాప్, ఐప్యాడ్ ఇస్తానని హామీ ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. టెక్నాలజీని ఉపయోగించుకొని అవినీతిని నిర్మూలించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. చదువు పూర్తి చేశాక ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగభృతి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

శనివారం చంద్రబాబు పాదయాత్ర అంగల కుదురు నుంచి మొదలై 7.3 కిలోమీటర్లు కొనసాగి రాత్రికి తెనాలిలో ముగిసింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. రుణ మాఫీ ఎలా సాధ్యమంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారని.. అధికారంలోకి వస్తే రైతులను ఏ విధంగా ఆదుకుంటామో చేసి చూపిస్తామన్నారు. కాంగ్రెస్ దొంగలను రక్షించటంలో ముఖ్యమంత్రి కిరణ్ తీరిక లేకుండా ఉన్నారని, మంత్రి ధర్మాన ప్రసాదరావును కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాడని చంద్రబాబు అన్నారు. ఆ శ్రద్ధ ప్రజలపై లేదంటూ విరుచుకు పడ్డారు. సొసైటీ ఎన్నికలలో ఓటును రూ.25వేలకు కొని కాంగ్రెస్ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే వ స్త్రాలపై వ్యాట్ టాక్స్‌ను కూడా రద్దు చేస్తామన్నారు. ఆర్యవైశ్యులను రాజకీయంగా పైకి తీసుకొస్తామని మాదిగ ఉపకులాలకు వర్గీకరణ కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. అన్ని వర్గాల వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

నేడు టీడీపీ పార్లమెంటరీ కమిటీ భేటీ
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీ సమావేశం ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా తెనాలిలో జరగనుంది. పాదయాత్రలో ఉన్న చంద్రబాబు ఉదయం 10 గంటలకు టీడీపీ ఎంపీలతో సమావేశమౌతారని పార్టీ వర్గాలు తెలిపాయి.