February 16, 2013

జలయజ్ఞం పేరుతో వైఎస్ డబ్బు తినేశారు

వైఎస్ మాటలు నమ్మి రైతులు ఇబ్బందుల్లో పడ్డారు
వ్యవసాయం దండగని ఎప్పుడూ చెప్పలేదు
ఇచ్చిన హామీలు నెరవేరుస్తా : చంద్రబాబు నాయుడు

  గడిచిన తొమ్మిదేళ్ళ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. వైఎస్ హయాంలో 14,500 మంది ఆత్మహత్య చేసుకుంటే, గత నాలుగేళ్ళలో మరింత ఎక్కువయ్యాయని, వైఎస్ మాటలు నమ్మిన రైతులు ఇబ్బందుల్లో పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

'వస్తున్నా...మీకోసం' పాదయాత్రలో భాగంగా చంద్రబాబునాయడు శనివారం జిల్లాలోని అంగలకుదురులో యాత్ర ప్రారంభించారు. అకాల వర్షం కారణంగా బాబు యాత్ర కొంచెం ఆలస్యంగా ప్రారంభమయింది. ఇటీవల రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేసుకున్న సందర్భంగా బాబు అంగలకుదురులో ఎన్టీఆర్ కిషాన్ భవన్‌కు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి ప్రజల డబ్బును దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు.

తాను వ్యవసాయం దండుగ అని ఎప్పుడు చెప్పలేదని, రైతుల పిల్లలు చదువుకోవాలని మాత్రమే చెప్పానని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు బతికి బట్టకట్టాలంటే రుణ మాఫీ మినహా మరే మార్గం లేదన్నారు. పరిశ్రమలకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం రైతుల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతోందని చంద్రబాబు ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అల్మట్టి డ్యామ్ కేసులో వైయస్ కారణంగానే ఓడిపోయామన్నారు. అసమర్థుడైన బంధువును వైయస్ లాయర్‌గా పెట్టడం వల్లే అలా జరిగిందన్నారు. కాలువల్లోకి నీళ్లు రావడం లేదు. కానీ రైతుల కళ్లలో మాత్రం కన్నీళ్లొస్తున్నాయన్నారు. తాను దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి వ్యవసాయం లాభసాటిగా మార్చాలని చూశానని ఆయన చెప్పారు.