February 16, 2013

ఆ నేతలు పశువులు కన్నా హీనం

సీఎం... ఖబడ్దార్!
రేపటి లోగా డెల్టాకు నీళ్లు రావాలి!
లేదంటే మహాధర్నాతో విజృంభిస్తాం
కిరణ్‌కు చంద్రబాబు హెచ్చరిక
గుర్తింపు ఇస్తే ప్యాకేజీలకు పోతున్నారు
'వలస'లపై ఫైర్
గుంటూరులో పాదయాత్ర పున: ప్రారంభం
పెత్తందారంటూ స్పీకర్ మనోహర్‌పై ధ్వజం

కృష్ణా డెల్టాకు ఆదివారం సాయంత్రంలోగా నీళ్లు విడుదల చేయాలని, లేదంటే సోమవారం మహా ధర్నా నిర్వహిస్తానని సీఎంకిరణ్‌ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. జిల్లాకు నీళ్లు తీసుకురాలేని స్పీకర్ నాదెండ్ల మనోహన్.. పెత్తందారిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దొంగల్ని కాపాడేపనిని కిరణ్ చేయకపోతే, ఇప్పటికి కేబినెట్ అంతా చంచలగూడ జైలులో ఉండేదని ఎద్దేవా చేశారు. కొలకలూరులో మెట్లు కూలిన సంఘటనలో కుడికాలి మడమ నొప్పి రావడంతో గురువారం మధ్యలోనే నిలిపేసిన పాదయాత్రను వైద్యుల సలహా తీసుకొని శుక్రవారం ఉదయం 11.45 గంటలకు ఆయన తిరిగి ప్రారంభించారు. అంతకుముందు.. ఫిజియోథెరపి, మసాజ్ తదితర చికిత్సలు తీసుకున్నారు.

ఏషియన్ గ్య్రాస్టో ఎంటిరాలజీ ఇనిస్టిట్యూట్ అధినేత డాక్టర్ నాగేశ్వరరెడ్డి స్వయంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన గుడివాడ, కోపల్లె మీదుగా 9.7 కిలోమీటర్లు నడిచి అంగలకుదురుకు చేరుకొన్నారు. చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పడుతూ ఆయన వెంట నడిచారు. " నేను చేస్తోన్న పాదయాత్ర ఎంతో పవిత్రమైంది. మీ కష్టాలు తీర్చడం కోసం ముందుకు సాగుతున్నాను. ఈ ర్రాష్టానికి మంచి చేయాలన్న సంకల్పం తప్ప నేను ఏ పదవో ఆశించి రాలేద''ని ఈ సందర్భంగా అన్నారు. ఘటన జరిగిన తీరును ఆయన గుర్తుచేసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, గుంటూరు జిల్లా పార్టీ నాయకులు ఆయనను కలిసి పరామర్శించారు. అనంతరం భగవాన్ సేవాలాల్ మహరాజ్ 274వ జయంతి సందర్భంగా టీడీపీ ఎస్టీ సెల్ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేక యూనివర్సిటీ సహా పలు హామీలతో కూడిన వికాస పత్రాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు.

పాదయాత్ర గుడివాడ గ్రామానికి చేరుకొన్న తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొన్నారు. యాత్రలో భాగంగా కలుసుకున్న వారికి పాదయాత్రలోని ఇబ్బందులను వివరించే ప్రయత్నం చేశారు. "పాదయాత్ర వలన నాకు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఒక్కోసారి నొప్పి భరించలేకుండా ఉంటోంది. 30 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అయినాసరే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను'' అని చెప్పారు. అక్రమాలపై ఎవరైనా నోరు తెరిస్తే జైలులో పెట్టడాన్ని తెలివిగల పనిగా భావిస్తున్నాడంటూ సీఎం కిరణ్‌పై విరుచుకుపడ్డారు. "సహకార ఎన్నికల్లో అక్రమాలపై పోరాడినందుకు మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావును జైల్లో పెట్టారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై తప్పుడు హత్య కేసు పెట్టారు. తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రావణ్‌కుమార్‌ను అరెస్టు చేసే పరిస్థితికి వచ్చార''ని విమర్శించారు.

పశువుల కన్నా హీనంగా జగన్ పార్టీకి అమ్ముడుపోతున్నారని టీడీపీ నేతల వలసల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. "పాదయాత్రలో ఉండగా ఒక ఆడబిడ్డ పొట్టేలును మేపడం చూశాను. ఆమె ఎక్కడికి వెళితే అది అక్కడికి వస్తుంది. ఆ ఆడబిడ్డను "ఏమ్మా నువ్వు ఎక్కడికి వెళితే అది అక్కడికి వస్తుంది. ఏమి పెట్టావు'' అని ఆసక్తిగా అడిగాను. గడ్డి పెట్టానని చెప్పింది. దాని మాత్రం విశ్వాసం కూడా ఈ నేతలకు ఉండటం లేదు. ఒక చిరునామా అంటూ లేని వాళ్లకు రాజకీయజీవితం ఇచ్చి ఎమ్మెల్యేలను చేశారు. వాళ్లిప్పుడు పశువుల కంటే హీనంగా విశ్వాసం లేకుండా జగన్ పార్టీ ఇచ్చే ప్యాకేజీలకు అమ్ముడు పోతున్నార''ని చంద్రబాబు ధ్వజమెత్తారు.

దోచుకోవడం, దొంగ ఫిర్యాదులు చేయడమే జగన్ పార్టీ సిద్ధాంతమని ఆరోపించారు. "యువతకు ఉద్యోగాలు రాకుండా పోవడానికి కారణం జగన్ దోపిడీనే. పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించి, ఉద్యోగాలు చూపించాల్సిన వాళ్లు వైఎస్ ప్రలోభాలకు లొంగిపోయారు. అందుకే ఈ నిరుద్యోగ సమస్య'' అని వివరించారు. దొంగలు, దొంగలు కలిసిపోయారని.. మంచివాళ్లంతా ఏకమై వారిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఏ పని జరగాలన్నా స్పీకర్ పర్మిషన్ అవసరమవుతోందని ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుపై చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు. "ఆయన ఓ పెత్తందారిగా మారారు. తెనాలి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఆయన అనుమతి తప్పనిసరి చేశారు. రేపు ఎన్నికలొస్తే ఆయన ఇంటికే పరిమితం కావడం ఖాయం. అప్పుడు ప్రజలకు ఎలాంటి అనుమతులు ఇచ్చే అవకాశం కూడా ఉండద''ని పేర్కొన్నారు.

అయినా..ఎదురుగాలే!
హైదరాబాద్: సీమాంధ్రలో ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులను తమ వైపు ఆకర్షించిన వైసీపీ.. వారి వల్ల ఏ మేరకు రాజకీయంగా లాభం పొందగలిగిందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ శిబిరంలో చేరిన టీడీపీ నేతల్లో అధికులు ఇటీవలి సహకార ఎన్నికల్లో పెద్దగా ఫలితాలు సాధించలేకపోయారు. మెజారిటీ నేతల సీట్లలో జగన్ పార్టీతో పోలిస్తే టీడీపీనే మంచి ఫలితాలు సాధించగలిగింది. పార్టీ ఫిరాయించిన నేతలు తమతోపాటు కింది స్థాయి క్యాడర్‌ను తీసుకు వెళ్లలేకపోవడమే ప్రధాన కారణంగా ప్రచారం జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో వైసీపీ వైపు చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు తన నియోజకవర్గంలో మంచి ఫలితాలు సాధిస్తే మరొకరు బాగా దెబ్బతిన్నారు.

తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి మెజారిటీ సీట్లను వైసీపీకి సాధించి పెట్టగలిగారు. కాని పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాధరెడ్డి వెనకబడిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేత కృష్ణబాబు, గోపాలపురం ఎమ్మెల్యే వనిత జగన్ శిబిరంలో చేరారు. అయినా ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఒకే ఒక్క సొసైటీ లభించింది. కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నియోజకవర్గంలో కూడా వైసీపీతో పోలిస్తే టీడీపీ రెట్టింపు సొసైటీలు దక్కించుకొంది. అదే జిల్లాలో వైసీపీలో చేరిన ఉప్పులేటి కల్పన నియోజకర్గం పామర్రులో సగానికి పైగా సొసైటీలు టీడీపీ కి దక్కితే జగన్ పార్టీకి అందులో ఐదో వంతు మాత్రమే లభించాయి.