January 17, 2013

తీపి జ్ఞాపకాల ఖమ్మం

నాకే భలే ఆశ్చర్యంగా ఉంది! నేనేనా..!? ఇన్ని కిలోమీటర్లు నడిచేశానా? అని కూడా అనిపిస్తోంది! ఖమ్మం జిల్లా రాయిగూడెం గ్రామంలో నా పాదయాత్ర 1700 కిలోమీటర్లు దాటడం మరో గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. ఈ జిల్లాలోనే వంద రోజుల మైలురాయిని అధిగమించడం.. మాదిరిపురంలో వంద అడుగుల స్థూపాన్ని ఆవిష్కరించడం మరచిపోలేని తీపి జ్ఞాపకం. సంక్రాంతి వేడుకలను కూడా జిల్లా ప్రజలతోనే జరుపుకోవడం, సొంత ఇంటిని మరిపించేలా ఈ జిల్లా ఆడపడుచులు చూపిన ఆదరణను, అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేను.

పాదయాత్ర యావత్తూ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అపూర్వమైన ఆదరణను చూపారు. రైతులు.. కూలీలు.. నిరుపేదలు.. యువత.. ఒకరనేమిటి.. దాదాపు అన్ని వర్గాలూ అర్ధరాత్రి వేళ కూడా గంటల తరబడి నా కోసం వేచి ఉండడం చూస్తే.. ఈ ప్రభుత్వం వారిని ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తోందో అర్థమవుతోంది. ఖమ్మం జిల్లాలో మాదిగ సోదరులు టీడీపీ కార్యకర్తలతోపాటు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఎస్సీ వర్గీకరణ చేసి వారి రుణం తీర్చుకుంటా.

ఈరోజు అప్పల నరసాపురంలో బస చేసి వస్తుంటే, అక్కడి ఎస్సీ కాలనీవాసులు తమ కాలనీకి రావాలని పట్టుబట్టారు. గ్రామంలో కర్నపూడి పెదగురవయ్య ఇంటికి వెళ్లాను. ఎస్సీ మహిళలంతా నావద్ద కూర్చుని తమ బాధలను వివరిస్తుంటే చలించిపోయాను. మా బతుకులు ఎట్లాగూ చదువుల్లేకుండానే తెల్లారాయని, కనీసం పిల్లల భవిష్యత్తు బాగుండాలని అనుకుంటే, ప్రైవేటు స్కూల్లో ఇంగ్లీషు మీడియం చదివించాలంటే ఫీజులు, బట్టలకే రూ.15 వేలు అవుతున్నాయని లక్ష్మి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

టీడీపీ అధికారంలోకి వస్తే, పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులు చెప్పిస్తానని హామీ ఇచ్చా. రాయిగూడెం వస్తుంటే కరెంటు కోతలతో పంటలు పండడం లేదని, సోలార్ పంపుసెట్లు కావాలని ఓ రైతు అడిగాడు. అధికారంలోకి వస్తే, రైతులకు సోలార్ పంపుసెట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పా. గురువారంతో ఖమ్మంలో పాదయాత్ర పూర్తవుతోంది. తీపి జ్ఞాపకాలతో నల్లగొండలో అడుగు పెడుతున్నా.