January 17, 2013

నీ కొడుకు నీతిగలవాడా?నిరూపిస్తారా?.. విజయలక్ష్మికి బాబు సవాల్


 "అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన జగన్‌ను తప్పించేందుకు వైఎస్ విజయలక్ష్మి సంతకాలు సేకరించి రాష్ట్రపతికి ఇచ్చారు. తన కొడుకు నిజాయతీపరుడని ఆమె నిరూపించగలరా?'' అని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ చేశారు. సంతకాలు సేకరిస్తే కేసులు మాఫీ అవుతాయా? అని ప్రశ్నించారు. 'వస్తున్నా మీకోసం' యాత్రలో భాగంగా బుధవారం ఆయన ఖమ్మం జిల్లా అప్పల నర్సింహాపురం, రాయిగూడెం గ్రామాల్లో మాట్లాడారు.

జగన్‌కు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని మోసగించేందుకు ప్రయత్నించారని, అలాంటి వారికి ఓట్లేసి వ్యవస్థను దిగజార్చొద్దని ప్రజలను కోరారు. తనను గుర్తుంచుకుని అవకాశమిస్తే పెద్ద కొడుకులా సేవ చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు రుణమాఫీ అమలుచేస్తానని, బెల్ట్ షాపులు రద్దు చేస్తానని, డ్వాక్రా మహిళలకు వడ్డీ వాపస్‌తోపాటు బీసీ డిక్లరేషన్‌కు రూ.10 వేల కోట్లు కేటాయించి అన్ని కులవృత్తుల వారికి ఉపాధి చూపిస్తామని, ఎస్సీ వర్గీకరణకు సహకరించి మాదిగలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

పేద ఆడపిల్లల చదువులు, పెళ్లిళ్లకు రూ.50 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేయిస్తానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నది దోపిడీ దొంగల ప్రభుత్వమన్నారు. "విద్యుత్ సర్‌చార్జీలు, చార్జీలు పెంచి ప్రజలపై భారాలు వేస్తూ దోచుకోవడమే దాని పని. చార్జీలు చెల్లించలేని దుస్థితిలో ప్రజలుంటే.. మరోసారి పెంచాలని చూస్తోంది'' అని మండిపడ్డారు. నిన్నటిదాకా రూపాయికి కిలో బియ్యం అన్న సీఎం కిరణ్.. ఇప్పుడు 'మన బియ్యం' అంటూ మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.