January 17, 2013

వెళ్ళొస్తా .. 'మీకోసం' మళ్ళీ వస్తా

జిల్లా ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానాలు ఎన్నటికీ మర్చిపోలేనని.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి చూపిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. జిల్లాలో ఎనిమిదో రోజు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రలో భాగంగా నేలకొండపల్లి మండలంలో పాదయాత్ర చేపట్టారు. నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం నుంచి బుధవారం ఉదయం 11.30కు బయలుదేరిన చంద్రబాబు పాదయాత్ర అప్పల నర్సాపురం, రాయిగూడెం, బుద్దారం, చెరువుమాదారం, పైనంపల్లికి చేరుకుంది. పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. చెరువు మాదారంలో మాట్లాడుతూ 'నిరుపేదలమైన తాము వేల రూపాయలు ఖర్చుచేసి తమ పిల్లలకు ప్రైవేటు చదువులు చెప్పించలేకపోతున్నామని ఓ మహిళ నా దృష్టికి తెచ్చింది.. టీడీపీ అధికారంలోకి వస్తే నిరుపేద వర్గాల పిల్లలకు పాఠశాల స్థాయిలోనే ఆంగ్లమాధ్యమంలో చదువులు చెప్పిస్తామ'ని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఒక రైతు విద్యుత్ కోత వలన పంటలు ఎండిపోయి పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కు రావడం లేదని చంద్రబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. స్పందించిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే సోలార్ విద్యుత్ మోటార్లు సబ్సిడీపై ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ప్రకటించారు. గతంలో మేం అధికారంలో ఉన్నప్పుడు.. ఆడపిల్ల పుడితే ఆ బాలిక పేరిట రూ.5వేలు డిపాజిట్ చేసే పథకాన్ని ప్రవేశపెట్టాం. ఇప్పుడది అమలు కావటం లేదు. మేం అధికారంలోకి వస్తే చదువుకునే అడ పిల్లలకు లేదా పెళ్లి సమయంలో రూ.50వేలు నగదు అందించే విషయం పరిశీలిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతులు వ్యవసాయంకోసం బ్యాంకుల్లో తెచ్చిన రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి రూ.1లక్ష ఇస్తామని, గ్రామాల్లో బెల్ట్ షాపులను రద్దు చేస్తామని పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ సుజలస్రవంతి పథకం ద్వారా అన్ని గ్రామాల్లో తాగునీటి పథకాలు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రిగా తన మూడో సంతకం సుజల స్రవంతి పథకం ఫైలుపైనేనని చంద్రబాబు చెప్పారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలపై ఇప్పటివరకు కట్టిన వడ్డీని వాపస్ చేస్తామన్నారు. రజక, పద్మశాలి, బెస్త, ముదిరాజ్, తదితర బీసీ ఉప కులాల వారందరికీ ఉచితంగా పనిముట్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ, జగన్‌లపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అవినీతి విధానాలపై ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అని, ఆయనకు ఏ అంశంపైనా కనీస అవగాహన లేదని విమర్శించారు. మంచి బియ్యం ఇప్పుడు ఇస్తామని ముఖ్యమంత్రి అంటున్నారు.. ఇప్పటివరకు పురుగు పట్టిన బియ్యం ఇచ్చినందుకు ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ పాలనలోనే ప్రభుత్వ వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ఆయన అవినీతి దోపిడీ విధానాల వల్ల లక్ష కోట్లు సంపాదించుకొని జగన్ జైలుకు వెళ్లాడు. ఆయన్ని విడిపించుకునేందుకు జడ్జీలను, లాయర్లను బెదిరించారు. అన్ని అడ్డదారులూ తొక్కి చివరకు.. సంతకాల పేరిట రాష్ట్రపతిని కూడా కలిశారు. హత్యలు చేసినవారు.. సంతకాలు సేకరించి రాష్ట్రపతికి చూపిస్తే.. కేసులు మాఫీ అవుతాయా అని ప్రశ్నించారు.

అడుగడుగునా జన నీరాజనం

చంద్రబాబు పాదయాత్ర బుధవారం నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల మీదుగా సాగింది. మంగళవారం రాత్రి ముదిగొండ మండల సరిహద్దు వల్లభి గ్రామశివార్లలో బస చేసిన బాబు బుధవారం ఉదయం 11.30కు బయలుదేరి నేలకొండపల్లి మండలంలో పద్దెనిమిది కిలోమీటర్లు నడిచి అర్దరాత్రి నల్గొండ జిల్లా సరిహద్దుకు చేరుకున్నారు. ప్రతి గ్రామంలో చంద్రబాబుపై పూల వర్షం కురిపిస్తూ ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. మొదట అప్పల నరిసింహాపురం, రాయగూడెం సభల అనంతరం బాబు మధ్యాహ్న భోజనం కోసం 3గంటలకు ఆగారు. సాయంత్రం 5.30కి పాదయాత్ర మళ్లీ మొదలైంది. రాత్రి వరకు బుద్ధారం, చెరువు మాదారం, పైనంపల్లి గ్రామాల్లో బాబు పాదయాత్ర సాగింది. పలుచోట్ల చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహాలు, పార్టీ జెండాలు ఆవిష్కరించారు. జిల్లా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికి మద్యం ముడుపులు ముట్టాయని ఆరోపించారు. టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆదిలాబాద్ పార్టీ ఇన్‌చార్జ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే బాబును కలిశారు.

నేలకొండపల్లి/ఖమ్మం అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి వల్లే రాష్ట్రం అభివృద్ధికి దూరమవుతోందని చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం రాత్రి చెర్వుమాదారంలో ఎన్‌టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.