January 3, 2013

బాబు టూర్‌కు ఇదే రూట్..



 


జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర రూట్‌మ్యాప్‌కు ఆ పార్టీ నేతలు తుదిమెరుగులుదిద్దుతున్నారు. ఈ నెల 8న రాత్రి వరంగల్ జిల్లా మరిపెడ నుంచి జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం గ్రామంలో చంద్రబాబు అడుగుపెడతారు. అక్కడ ఆయనకు జిల్లా టీడీపీనేతలు స్వాగతం పలికి అక్కడే మిషన్ స్కూల్‌లో బస ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ మరునాడు (9వతేదీ) నుంచి జిల్లాలో బాబు తన యాత్రను ప్రారంభించేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం నుంచి బాబు పాదయాత్ర చేపట్టనున్నారు.

అయితే చంద్రబాబు పాదయాత్ర చేపట్టి వందరోజులు పూర్తవుతున్న సందర్భంగా 'పాదయాత్ర వందరోజుల పండుగ'ను జిల్లాలో నిర్వహించనున్నారు. సుబ్లేడ్ క్రాస్‌రోడ్డు వద్ద ఎన్టీ ఆర్ విగ్రహావిష్కరణతోపాటు పాదయాత్ర 100రోజుల పూర్తయిన గుర్తుగా విజయోత్సవ చిహ్నాన్ని నిర్మించి దాన్ని కూడా చంద్రబాబు చేతులుమీదుగా ఆవిష్కరింపజేసేందుకు జిల్లా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. హస్నాబాద్, బచ్చోడు, బీరోలు, బంధంపల్లి మీదుగా చంద్రబాబు యాత్ర కూసుమంచి మండలానికి చేరుకుని.. అక్కడి నుంచి ఖమ్మం చేరుకుంటుంది. ఖమ్మంనుంచి ప్రకాష్‌నగర్ మీదుగా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం, పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లిల మీదుగా నల్గొండ జిల్లా కోదాడకు చేరుకోనుంది. ఇక ఖమ్మం జిల్లాలో సుమారు 110కి.మీ. దూరంతోపాటు 12రోజులపాటు చంద్రబాబు పాదయాత్ర సాగే అవకాశం ఉంది. చంద్రబాబు పాదయాత్రలో వందరోజుల పండుగ సందర్భంగా ఆరోజు బహిరంగ సభనిర్వహిస్తున్నందున ఎక్కువ దూరం నడిచే అవకాశం లేదు. దీనికితోడు ఈనెల 11న టీడీపీ రాష్ట్రకమిటీ సమావేశం కూడా యాత్రలోనే జరిగే అవకాశం ఉండడంతో ఆరోజు కూడా తక్కువ దూరం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరోజు పాదయాత్రకు విరామం ఉండొచ్చని సమాచారం. దీంతో జిల్లాలో 22వరకు చంద్రబాబు పర్యటన సాగే పరిస్థితి కనిపిస్తోంది. బాబు పర్యటన ఏర్పాట్లపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, తెలుగు మహిళానాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి తదితరులు చర్చించారు. బుధవారం తిరుమలాయపాలెంనుంచి ఖమ్మం వరకు బాబు యాత్ర జరిగే మార్గాన్ని పరిశీలించారు. గురువారం ఖమ్మంనుంచి ప్రకాష్‌నగర్‌మీదుగా ముదిగొండ, నేలకొండపల్లి మండలాల మీదుగా నల్గొండ జిల్లా కోదాడకు వెళ్లే మార్గాన్ని పరిశీలించి రూట్‌మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. అయితే జిల్లాలోని ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో మాత్రమే బాబు పాదయాత్ర నిర్వహించనున్నారు.