January 3, 2013

ప్రజాధనాన్ని లూటీ చేసి ఇప్పుడు గగ్గోలు




కోర్టుల కోసమే కోటి సంతకాలా?
వీళ్లను చూసి ఢిల్లీ రేపిస్టులూ సంతకాలు సేకరిస్తారు
వరంగల్ జిల్లా పాదయాత్రలో చంద్రబాబు


వైఎస్ జగన్ జైల్లో ఉండి, కోర్టులను ప్రభావితం చేసేందుకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. బెయిల్ కోసం నానా తంటాలు పడి ఇప్పుడు సంతకాల కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆయన ఎద్దేవా చేశారు.

బుధవారం వరంగల్ జిల్లాలో చంద్రబాబు 'వస్తున్నా... మీ కోసం' పాదయాత్ర ఐదోరోజూ ప్రశాంతంగా సాగింది. పాదయాత్రలో భాగంగా కామారం, పెంచికలపేట, లక్ష్మీపురం గ్రామాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. "ప్రజాధనాన్ని లూటీ చేసి ఇప్పుడు తమకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు.. వీరిని చూసి సామూహిక అత్యాచారం చేసిన దుర్మార్గులు కూడా రేపు సంతకాల సేకరణ చేస్తారేమో''నని వ్యాఖ్యానించారు.

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం
ముఖ్యమంత్రి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, అవినీతి పరులకు కొమ్ముకాస్తున్నారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. టీడీపీ కార్యకర్తలను జైలుకు పంపేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబాన్ని సోదాల పేరుతో ఇబ్బందులు పెట్టారన్నారు. ఆమె కుమారుడు శ్రీరామ్‌పై తప్పుడుకేసు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

మంత్రి ధర్మాన అవినీతిని సీబీఐ నిగ్గుతేల్చినా ఆయన అరెస్టు కాకుండా అడ్డుకుంటున్న ముఖ్యమంత్రి, అన్యాయంగా ఓ ఆడబిడ్డను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేత కోడెల శివప్రసాద్ నాయకత్వంలో ర్యాలీ తీస్తున్న కార్యకర్తలను అన్యాయంగా పోలీసులు చితకబాదారన్నారు. వరంగల్ జిల్లాలో రౌడీ రాజకీయం చేస్తున్న మహిళా ఎమ్మెల్యే భర్తకు రాజశేఖర్‌రెడ్డి గన్‌మెన్‌ను ఇచ్చి భద్రత కల్పిస్తే.. తమ కార్యకర్త ప్రతాప్‌రెడ్డిని హత్య చేశారని అన్నారు. ఆరు గ్రామాల మీదుగా 16.2 కిలోమీటర్ల దూరం మేర చంద్రబాబు పాదయాత్రను కొనసాగించారు.

కాలు నొప్పితో బాబు నడక వేగాన్ని తగ్గించారు. గిర్నిబావి వద్ద రాత్రి బస చేశారు. పాదయాత్ర ప్రారంభం కావడానికి ముందు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి వచ్చి ఆయనతో రెండు గంటల పాటు గడిపారు. పాదయాత్రలో బాబు వెంట పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి తొండెపు దశరథ జనార్దనరావు, అనంతపురం జిల్లా పార్టీ నేత ఎన్‌టీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ఆత్మహత్యలు వద్దు..
తెలంగాణకు తాను వ్యతిరేకిని కానని ఇన్నాళ్లూ చెబుతున్న చంద్రబాబు.. బుధవారం ఒక అడుగు ముందుకువేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని అభ్యర్థించారు. ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల వారిపై ఆధారపడిన కుటుంబాలు అండను కోల్పోతాయని, ఇబ్బందులు పడతాయని చెప్పారు. రాష్ట్రం కోసం పోరాడాలి తప్ప బలవన్మరణాలకు పాల్పడరాదని ఉద్బోధించారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను పార్టీ పరంగా ఆదుకుంటామన్నారు.

పోలీసుల ఓవర్ యాక్షన్: పాదయాత్రలో పోలీసుల ఓవర్‌యాక్షన్ వల్ల ప్రజలు, పార్టీ కార్యకర్తలు, పాత్రికేయులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. రోప్ పార్టీ అత్యుత్సాహం వల్ల సామాన్య జనం బాబు దరిదాపుల్లోకి వెళ్లలేకపోతున్నారు. కేశవాపురంలో బాబును కలవడానికి బోనాలు ఎత్తుకొచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో నిరసనగా భైఠాయించారు.

మేం కాల్వలు నిర్మించాం
దుగ్గొండి: వరంగల్ జిల్లాలో కాకతీయు కాలంలో చెరువులు నిర్మిస్తే, తమ ప్రభుత్వ హయాంలో కాలువలను నిర్మించామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పాదయాత్రలో భాగంగా బుధవారం రాత్రి ఆయన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావికి చేరుకున్నారు. బహిరంగ సభలో మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల రంగానికి పెద్ద పీట వేశామన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో వేల కోట్ల రూపాయలను దిగమిగింందని విమర్శించారు. వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు.vv