January 3, 2013

ఈ వృద్ధుల ఉసురు తగలదా!



పెంచికలపేట, కేశవపురం, లక్ష్మీపురం, పొనకల్, గిర్నిబావి.... పల్లె పల్లెనూ పలకరిస్తూ వెళ్తున్నా! ప్రతి చోటా ఓ దృశ్యం కనిపించింది. నా మనసును మెలితిప్పింది. అది.. వృద్ధులు, వికలాంగులు ఎదుర్కొంటున్న కష్టం. ఈ గ్రామాల్లో పాదయాత్ర సాగుతున్నప్పుడు చాలా మంది వృద్ధులు దారిపక్కన నాకోసం ఎదురు చూస్తూ కనిపించారు. లక్ష్మీపురం దాటిన తర్వాత దాదాపు 50 మంది వికలాంగులు శిబిరంలో నాకోసం ఎదురు చూస్తున్నారు. వారందరి చేతుల్లో వినతిపత్రాలు. వాటిని తీసుకుని పరిశీలించాను. అన్నింటిలోనూ ఒక్కటే విన్నపం. 'మాకు పెన్షన్ అందడంలేదు! పింఛను అందించండి. కష్టం తీర్చండి' అని వారు మొర పెట్టుకుంటున్నారు. వృద్ధుల్లో చాలామందికి కంటిచూపు సరిగాలేదు. దాదాపు అందరి నడుములు వంగిపోయాయి. అయినా... నా కోసం ఎదురు చూస్తూ నిల్చున్నారు.

పెన్షన్లను సంతృప్త స్థాయిలో ఇచ్చామంటున్న పాలకుల మాటలు ఒట్టి నీటిమూటలేనని తేలిపోయింది. కాంగ్రెస్ వాళ్ల మోసాలను కూడా స్థానికులు వివరించారు. 70 ఏళ్లు దాటిన ముదుసలులు పెన్షన్‌కు అర్హులుకారంటూ వారి దరఖాస్తులు పక్కన పడేశారట! 30 ఏళ్ల వయసున్న కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారట! వృద్ధుల సొమ్ము కూడా మెక్కేందుకు వీరికి మనసు ఎలా ఒప్పుతోందో!? పైగా... పెన్షన్ల చెల్లింపులో కేంద్ర వాటాను కూడా పక్కదారి పట్టిస్తున్నారు.

రాజకీయ రంగులతో సంబంధం లేకుండా.. అర్హులైన వృద్ధులందరికీ ప్రతినెలా రూ.600 పెన్షన్ ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. కేంద్రంలో భావసారూప్య పార్టీ అధికారంలో ఉంటే... పెన్షన్ మరింత పెంచుతాను. వికలాంగులకు రూ.వెయ్యి నుంచి 1500 వరకు పెన్షన్ ఇవ్వాల్సిన అవసరముంది. వీరిలో కొందరు కేవలం పాలకుల నిర్లక్ష్యం వల్ల వికలాంగులైన వారే! వికలాంగులకు కేవలం పెన్షన్ ఇచ్చి సరిపెట్టడం సమంజసం కాదు. వారి సామర్థ్యాన్ని బట్టి తగిన ఉపాధి అవకాశాలూ కల్పించాలి. ఆ దిశగా ఆలోచిస్తూ ముందుకు కదులుతున్నాను.