December 23, 2012

మీరేమో సమస్యలు పట్టించుకోరు, వాటిని తెలుసుకునేందుకు వచ్చిన నాపై దాడులా?



అందరి బతుకు నాశనం చేశారు!

మీరేమో సమస్యలు పట్టించుకోరు

వాటిని తెలుసుకునేందుకు వచ్చిన నాపై దాడులా?

అడ్డుకోబోయిన టీఆర్ఎస్ కార్యకర్తలపై బాబు నిప్పులు

గులాబీ అధినేతపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. " మీ నాయకుడిలా ఆరు నెలలకొకసారి నిద్రలేసేవాడిని కాదు'' అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. 'మేం తలుచుకుంటే అడ్రస్ ఉండద''ని తన పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నించినవారిని గట్టిగా హెచ్చరించారు. గత తొమ్మిది రోజులుగా కరీంనగర్‌లో నిర్విఘ్నంగా సాగిపోతున్న బాబు పాదయాత్రకు.. ఆదివారం అక్కడక్కడ స్వల్ప నిరసనలు వ్యక్తం అయ్యాయి.

జూబ్లీనగర్, చామనపల్లి, చెర్లబూత్కూర్, దుబ్బపల్లి, భూపతిపూర్, గర్రెపల్లి శివారు వరకు ఆయన పాదయాత్ర సాగింది. జూబ్లీనగర్ వద్ద ముగ్గురు, చామనపల్లి సభలో నలుగురైదుగురు టీఆర్ఎస్ కార్యకర్తలు.. చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణపై వైఖరి చెప్పాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్‌పై, కేసీఆర్‌పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

"టీఆర్ఎస్ అందరి జీవితాలను నాశనం చేసింది. తెలంగాణకు వ్యతిరేకం కాదని, భవిష్యత్‌లోనూ వ్యతిరేకించబోనని మూడు నెలలుగా చెబుతూనే వస్తున్నాను. మీ సమావేశాలకు మేం వస్తున్నామా? మీరు ఇక్కడకు వచ్చి గొడవ చేయడం సమంజసమా? రాజకీయ దురుద్దేశంతోనే మీ నాయకుడు మిమ్మల్ని ఇక్కడకు పంపిస్తున్నారు. మేం తలుచుకుంటే మీ పార్టీ అడ్రస్ ఉండదు... నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పట్టించుకుంటూ పరిష్కారం కోసం కార్యక్రమాలు చేపడుతున్నాం. మీ నాయకుడిలా ఆరు నెలలకోసారి నిద్రలేచే వాడిని కాదు. మర్యాదగా వ్యవహరించాలి. గత ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచి ఉంటే టీడీపీ ప్రభుత్వం వచ్చేది. పరిస్థితి వేరేలా ఉండేది'' అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

టీఆర్ఎస్, బీజేపీ వారు తన పాదయాత్రలు జరుగుతున్న చోటుకు రావద్దని హితవు పలికారు. " టీఆర్ఎస్ నేతలు ఏ సమస్య పరిష్కారం గురించీ ఆలోచించింది లేదు. పిల్లలను ఉపయోగించుకొని ఎమ్మెల్యేలుగా గెలువాలనే ఆశ తప్ప చేసిందేమీ లేదు. కాంగ్రెస్ అసమర్థ, అవినీతి పార్టీ. వైసీపీ జైలులో ఉండేపార్టీ'' అని చంద్రబాబు అన్నారు. టీడీపీ వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ కాగా, టీఆర్ఎస్ పెట్టుబడిదారుల, భూస్వాముల పార్టీ అని విమర్శించారు. రాజకీయంగా టీడీపీని దెబ్బతీయాలని కాంగ్రెస్ చూస్తున్నదని, తమ పార్టీని కాపాడుకోవల్సిన అవసరం ఉందని చంద్రబాబు ప్రజలకు సూచించారు.

"మీ పెద్దబిడ్డగా మీకు అండగుంటా. పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకొని నాకు సహకరించండి' అని కోరారు. రైతులకు, పేదలకు అండగా ఉండాలేగానీ పొట్ట కొట్టేదిగా ప్రభుత్వం ఉండకూడదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా ఉండగా 80 వేల కోట్ల బడ్జెట్‌తోనే అన్ని రంగాలలో అభివృద్ధి సాధించామని, ఈ రోజు లక్షా 53 వేల కోట్ల బడ్జెట్ ఉన్నా ఏమీ జరగడం లేదని, నాయకుల అవినీతే దీనికి కారణమని విమర్శించారు. అధికారంలోకి వస్తే చేనేత పాలసీని అమలుచేస్తామని వివరించారు. "చేనేత రంగానికి వేయి కోట్లు కేటాయిస్తాం. కార్పొరేషన్ ఏ ర్పాటు చేస్తాం. రుణాలు మాఫీ చేస్తాం. లక్షన్నర రూపాయలతో చేనేత కార్మికులకు ఇల్లు కట్టిస్తాం'' అని భరోసా ఇచ్చారు.
No comments :

No comments :