December 25, 2012

అఖిలంలో కాంగ్రెస్‌ను ఓ పట్టు పడదాం



సీమాంధ్ర నేతలతో చర్చిస్తా..
పొలిట్‌బ్యూరోలో నిర్ణయం తీసుకుంటా
తెలంగాణ నేతలతో చంద్రబాబు

అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తూనే సీమాంధ్రలోనూ పార్టీకి ఇబ్బంది కలగని వైఖరి తీసుకొనే ఆలోచన ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా రేగడిమద్దికుంట గ్రామం వద్ద తెలంగాణ ప్రాంత ముఖ్య నేతలతో మంగళవారం సమావేశమైన ఆయన వారి అభిప్రాయాలు తెలుసుకోవడంతోపాటు తన మనసులోని ఆలోచనలను కూడా వారితో పంచుకొన్నారు.

"కేంద్రం ఏదో ఒకటి తేల్చేస్తుందని అఖిలపక్షం కోరాం. తీరా ఇప్పుడు చూస్తే ఎవరేమనుకొంటున్నారో విషయం తెలుసుకోవడానికి పెడుతున్నామని చెబుతున్నారు. వాళ్లు అడుగుతుంటే మనం ఎదురుగా కూర్చుని చేతులు కట్టుకొని చెప్పాలా? మనం తెలంగాణ పట్ల సానుకూలంగా ఉన్నామని చాలాకాలంగా చెబుతున్నాం. ఆ విషయం అఖిలపక్షంలో మనతో చెప్పించి తర్వాత సీమాంధ్రలో మనని ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందుకే అటూఇటూ ఇబ్బంది రాకుండా ఏం చెప్పాలో ఆలోచిస్తున్నాం. బుధవారం సీమాంధ్ర నేతలతో కూడా మాట్లాడతాను.

పొలిట్‌బ్యూరోలో తుది నిర్ణయం చేస్తాను. కాంగ్రెస్‌ను మాత్రం వదిలిపెట్టేది లేదు. అఖిలపక్షంలో ఆ పార్టీని ఒక పట్టు పడదాం'' అని ఆయన అన్నారు. అయితే.. తెలంగాణపై సానుకూలతను స్పష్టంగా వ్యక్తం చేస్తే రాజకీయంగా చాలా మేలు కలుగుతుందని, ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని తెలంగాణ నేతలు ఆయనను కోరారు. "కేసీఆర్ ప్రతిష్ఠ బాగా దెబ్బ తింది. అఖిలపక్ష సమావేశం మనకు అందివచ్చిన అవకాశం. దీనిని జార్చుకోవద్దు. గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని మనం పదేపదే చెబుతున్నాం. దానినే పునరుద్ఘాటిద్దాం'' అని వారు ఆయన వద్ద పేర్కొన్నారు.

వారి అభిప్రాయాలను కూడా తాను పరిగణనలోకి తీసుకొంటానని బాబు చెప్పారు. అఖిలపక్షంలో పార్టీ వైఖరిని లిఖితపూర్వకంగా ఇస్తే ఎలా ఉంటుందన్నదానిపై కూడా చర్చ జరిగింది. ఇతర పార్టీలు అనుసరించే వైఖరి ఎలా ఉంటుందన్న అంశం కూడా చర్చకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తన వైఖరి చెప్పే అవకాశం లేదని, వైసీపీ తన అభిప్రాయం చెప్పకుండా ముందు కాంగ్రెస్ చెప్పాలని పట్టుబట్టే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. బాబు బుధవారం సీమాంధ్రకు చెందిన నేతలతో భేటీ కానున్నారు.

గురువారం ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. కాగా..అఖిలపక్షానికి చంద్రబాబే స్వయం గా హాజరై తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు ఆయన్ను కోరారు. ఈమేరకు జేఏసీ కో-చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తమ నిర్ణయం ఉంటుందన్నారు. "అయితే ఒకసారి జై తెలంగాణ అనండి'' అని కోరగా బాబు మౌనంగా ఉండిపోయారు.