December 25, 2012

ఏవీ ఆ వెలుగు ప్రస్థానాలు?



ఉత్తర తెలంగాణకు సింగరేణి సంస్థ మణిహారం. గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ విద్యుత్ వెలుగులు విరజిమ్మడానికి ఆధారం. మూడు, నాలుగు జిల్లాల పరిధిలో లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న సంస్థ అది. సింగరేణిని నడిపించే ప్రధాన శక్తులు కార్మికులే. ప్రాణాలకు తెగించి మరీ గని బావుల్లో పనిచేస్తారు. మనకు వెలుగులు అందించడం కోసం చీకటి గుయ్యారాల్లోకి నడుస్తారు. ఊపిరి బలిపెట్టి నల్ల బంగారం బయటకు తీస్తారు.

దీన్నంతా దృష్టిలో ఉంచుకొని నా హయాంలో కంపెనీ లాభాల్లో వారికీ వాటా ఇచ్చే ప్రయత్నం చేశాను. సంస్థ ఆర్జించే మొత్తం లాభాల్లో 12 శాతం వారికే ఇచ్చేలా యాజమాన్యాన్ని ఒప్పించాం. నష్టంలో ఉన్న సంస్థను బయటపడేయటంలో నా ప్రభుత్వం పాత్రతో పాటు కార్మికుల భూమిక కూడా విస్మరించరానిది. కేంద్రంలో చక్రం తిప్పే పరిస్థితిలో అప్పట్లో నేను ఉండటం, కార్మికుల శ్రమ కలగలిసి మూత ముప్పు నుంచి సింగరేణి బయటపడింది.

" సార్..మీరు ఉండగా మాకు బతుకు బెంగ లేదు. మేమూ ప్రభుత్వ ఉద్యోగుల్లా వెలిగిపోయాం. బోనస్ నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాల దాకా..ఎన్నో విధాల మమ్మల్ని మీ ప్రభుత్వం ఆదుకుంది'' అని కొలనూరులో కలిసిన ఆ కార్మికులు గుర్తు చేస్తున్నప్పుడు, సింగరేణి కోసం మా నేత ఎన్టీఆర్, ఆ తరువాత నేను తీసుకొచ్చిన సంస్కరణల జాడ ఎక్కడ అని బాధనిపించింది. అప్పటి ఆనందం ఆ కార్మికుల్లో ఇప్పుడు కనిపించడం లేదు. ఉద్యోగ సంక్షేమం గురించి పట్టించుకునేవారు లేరు. కొత్త కొలువులు అస్సలే లేవు. ఓపెన్‌కాస్ట్ వచ్చిన తరువాత ఉన్నవారికీ దినదినగండంగానే గడిచిపోతుందని వాళ్ల మాటలను బట్టి అర్థమయింది. ఏవీ ఆ వెలుగు ప్రస్థానాలు?

సంక్షేమాన్ని బదిలీ చేయాల్సిన పథకం కాస్తా పేదల బతుకుల్లోకి మరింత సంక్షోభాన్ని బదిలీ చేస్తున్నదనే విషయం గోపర పల్లి మహిళలతో మాట్లాడినప్పుడు తేటతెల్లం అయింది. నగదు బదిలీ పథకంలో భాగంగా ఇక డబ్బులే గానీ చౌక బియ్యం ఉండవని అధికారులు చెబుతున్నారట. "సార్ బియ్యమిస్తే గంజి కాసుకొని తాగుతాం..అదే డబ్బులిస్తే మా మొగుళ్లు తీసుకెళ్లి సారా తాగుతారు'' అన్న మహిళల మాటలు, నన్నూ ఒక్కక్షణం ఆందోళనకు గురిచేశాయి.