December 25, 2012

తన కుటుంబ సభ్యులకు ఈ పరిస్థితి తలెత్తితే బొత్స సత్యనారాయణ ఇలాగే వ్యాఖ్యానించేవారా



ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో 11వ రోజు వస్తున్నా… మీకోసం పాదయాత్రను ఆయన సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట వద్ద మంగళవారం ప్రారంభిచారు.

ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. బొత్స సత్యనారాయణవి సిగ్గు లేని మాటలని ఆయన వ్యాఖ్యానించారు. తన కుటుంబ సభ్యులకు ఈ పరిస్థితి తలెత్తితే బొత్స సత్యనారాయణ ఇలాగే వ్యాఖ్యానించేవారా అని ఆయన అడిగారు. కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలను కూడా ఆయన తప్పు పట్టారు. విద్యార్థులను తీవ్రవాదులతో పోల్చడం విచారకరమని ఆయన అన్నారు. గ్యాంగ్ రేప్ నిందితులను ఉరి తీయాలని ఆయన వ్యాఖ్యానించారు.

ఆ సంఘటనకు ప్రతి ఒక్కరు అవమానంతో తల దించుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెసు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డితో ప్రారంభమైన దేవుడ్ని అమ్ముకునే దుష్ట సంప్రదాయం ఇంకా కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. తిరుమల బంగారం శుద్ధిలో 40 శాతం తరుగు చూపిస్తూ దేవుడి సొమ్మును దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ మరో నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అన్నారు.

శ్రీవారి భక్తులకు కీలకమైన డిసెంబర్ నెలలోనే తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నారని, దీనివల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతోందని ఆయన అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు అవినీతి మహాసభలని పేరు పెడితే బాగుంటుందని గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. మహిళల పట్ల మనసులో ఉన్న దురుద్దేశాన్ని బొత్స సత్యనారాయణ బయటపెట్టి ఆ తర్వాత క్షమాపణ చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ వ్యతిరేక సిద్ధాంతాలు అవలంబిస్తున్న బొత్స వంటి నాయకులకు ఆ పేరు వాడుకునే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు.