December 25, 2012

నిత్యావసరాలను అందకుండా చేసేందుకే కేంద్రం నగదు బదిలీ పథకం పేరుతో కుట్ర



పేద అట్టడుగు వర్గాలకు కల్పిస్తున్న రాయితీలను ఉపసంహరించి బియ్యం, పంచదార వంటి కనీస నిత్యావసరాలను అందకుండా చేసేందుకే కేంద్రం నగదు బదిలీ పథకం పేరుతో కుట్ర పన్నుతోందని, ఈ పథకాన్ని ప్రజలంతా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తే అండగా ఉండి పోరాటం చేస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి శాసనసభా నియోజకవర్గ పరిధిలోని రేగడిమద్దికుంట, గోపరపల్లి, కొలనూరు గ్రామాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు తినేందుకు బియ్యం కావాలి తప్ప, కేంద్రం ఇచ్చే ముష్టి డబ్బులు కాదని అన్నారు. ఈ పథకం పేరు చెప్పి సబ్సిడీలన్నీ ఎత్తివేసేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోందని ఆరోపించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆడపిల్లలు అర్ధరాత్రి తిరుగకూడదంటూ మాట్లాడడం నీచాతి నీచమని, ఆయనకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, అలాగే చేస్తారా? అని ప్రశ్నించారు. దేశ రాజధాని నడిబొడ్డున ఓ ఆడబిడ్డపై అత్యాచారం జరిగిందంటే దేశంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ సంఘటనపై నిరసన వ్యక్తం చేసేందుకు వేలాది యువజనం ఢిల్లీకి వస్తే వారిని సముదాయించాల్సింది పోయి హోం మంత్రి షిండే యువకులను తీవ్రవాదులతో పోల్చడం ఏమిటని? ప్రశ్నించారు. తెలంగాణ పేరుతో కాంగ్రెస్ తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఈ సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి దానికి ఎంతమాత్రం లేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కరీంనగర్ జిల్లాలోని ప్రతీ పల్లెకు తాగునీటి కోసం గోదావరి జలాలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యేలతో బాబు మంతనాలు
ఈ నెల 28న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలంగాణ అంశంపై అఖిలపక్ష భేటీ నిర్వహించనున్న నేపథ్యంలో టిడిపి వైఖరిని ఖరారు చేసేందుకు చంద్రబాబు ఇరు ప్రాంతాల నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన విడిదిచేసిన రేగడిమద్దికుంట గ్రామంలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతో దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. బుధవారం సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఆ తరువాత ఈ నెల 27న పొలిట్‌బ్యూరోలో తెలంగాణపై ఎలాంటి వైఖరిని అనుసరించాలి, ఎవరిని పంపాలన్నదానిపై తుది నిర్ణయం తీసుకుంటారని టిడిపి ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. సమావేశం ముగిసిన తరువాత టి-టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ అఖిలపక్ష భేటీలో ఏం చెప్పాలన్నదానిపై బాబు తమ అభిప్రాయం కోరారని, అయితే సీమాంధ్ర ఎమ్మెల్యేలు నాయకులతో మాట్లాడిన తరువాత దీనిపై నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినట్లు వెల్లడించారు.