December 21, 2012

గొల్లుమంటున్న అంగన్‌వాడీ వర్కర్లు

అంగన్‌వాడీ వర్కర్లు..గ్రామీణ ప్రాంతాలకు అక్షయపాత్రలు. పేదలు, కూలీల పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో వీళ్ల పాత్రే కీలకం. అలాంటివాళ్లు ఇవాళ గొల్లుమంటున్నారు. వాళ్ల 'పాత్ర' దాదాపు ఖాళీగా కనిపిస్తోంది. వాళ్లు ఇన్ని కష్టాలు పడుతున్నారనే విషయం గోలి రామయ్యపల్లెలో అడుగు పెట్టే వరకు నాకూ తెలియదు. వాళ్ల మాటల్లో పరిస్థితిని విన్నప్పుడు బాధనిపించింది. భావి పౌరులందరికీ పౌష్టికాహారం ఇచ్చి శారీరకంగానూ మానసికంగానూ దోహదపడే ఇంత మంచి వ్యవస్థను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారనిపించింది.

"జీతం,భత్యం లేకుండా పనిచేస్తున్నాం సార్. ఇచ్చే ఆ అరకొర జీతం కూడా ఐదు నెలలుగా రావడం లేదు. రేషన్ ఇవ్వడమూ అంతే. మా దగ్గర లేకుండా పిల్లలకు ఏమి పెట్టాలి? గట్టిగా వాన పడితే మేమూ పిల్లలూ ముద్దముద్దే. సొంత భవనాల గురించి ఎంత కొట్లాడినా సర్కారులో సోయే లేదు'' అని కొందరు మహిళలు వాపోయారు. వాళ్ల ఆవేదనలో నిజం ఉన్నదనిపించింది. బండెడు చాకిరీ చేసినా చిటికెడు గుర్తింపునకు వాళ్లు నోచుకోవడం లేదు.

వీళ్లకేదో కొత్తగా ఒరగబెడతారని కాదు గానీ, ఇచ్చేదైనా సరిగ్గా ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్ర తాజా బడ్జెట్‌లో అంగన్ వాడీ వర్కర్ల గౌరవ వేతనం దాదాపు నాలుగు వేలకు పెరిగినా వారికి పూర్తిగా అందిందే లేదు. ఆ వేతనంలో ఏడు వందలు రాష్ట్రం వాటా. మిగతాది కేంద్రం విడుదల చేస్తుంది. తన వాటా ఇవ్వకపోగా కేంద్రం ఇస్తున్న నిధులనూ మన ప్రభుత్వం వేరే కార్యక్రమాలకు దారి మళ్లిస్తున్నది. దీనిపై అంగన్‌వాడీ వర్కర్లు రోడ్డెక్కినా పట్టించుకోవడం లేదు. చివరకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలూ పాటించడం లేదు. ఎంత ఘోరం?

నీళ్లు వస్తున్నాయంటే ఊళ్లు కళకళలాడాలి. ప్రాజెక్టు కడుతున్నారంటే కొత్త ఆయకట్టు సాగులోకి రావాలి. కానీ, కోరటపల్లిలో రైతులు మాత్రం మోతె ప్రాజెక్టు అంటేనే బెదిరిపోతుండటం కనిపించింది. "సార్ అది మోతె ప్రాజెక్టు కాదు.. మా ప్రాణాలకు ఉరి బిగించే ప్రాజెక్టు. దానివల్ల మా భూములన్నీ ముంపులో పడతాయి. మరే ప్రాజెక్టూ మాకొద్దు. శ్రీరాంసాగర్ నీళ్లు సక్రమంగా విడుదల చేస్తే అదే మాకు పది వేలు'' అని రైతులు చెబుతుంటే, ఇదేమి అభివృద్ధి, ఎందుకీ జలయజ్ఞం అనిపించింది.