December 22, 2012

ముఖ్యమంత్రి.. నేరస్తులకు కొమ్ముకాస్తున్నాడు!కరీంనగర్ పాదయాత్రలో టీడీపీ అధినేత

ముఖ్యమంత్రి.. నేరస్తులకు కొమ్ముకాస్తున్నాడు!
ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడు
అవినీతి జీవోలపై మంత్రులకు మద్దతిస్తాడు
కానీ, రైతులు చస్తున్నా పట్టించుకోడు
సీఎం కిరణ్‌పై చంద్రబాబు నిప్పులు
అవినీతిపరులెవరైనా శిక్షించాల్సిందే
బంగారం రేట్లు పెంచిన గాలి పసిడి దాహం
కరీంనగర్ పాదయాత్రలో టీడీపీ అధినేత

కరీంనగర్, డిసెంబర్ 21 (ఆంధ్రజ్యోతి): "అవినీతి మంత్రులకు, నేరస్తులకు ఈ ముఖ్యమంత్రి కొమ్ము కాస్తున్నారు. శిక్షించాల్సింది పోయి కాపాడుతున్నారు. అవినీతిపరులు మంత్రులైనా, ఎవరైనా సరే, వారు ఎక్కడున్నా నిర్ధాక్షిణ్యంగా శిక్షించాల్సిందే''నని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తి నుంచి శుక్రవారం ఆయన పాదయా త్ర ప్రారంభించారు. రామడుగు, షానగర్ క్రాస్ రోడ్, గోలి రామయ్యపల్లి, మోతె క్రాస్ రోడ్, కోరటపల్లి, కొక్కెరకుంట «గ్రామ శివారు వరకు 14.4 కిలోమీటర్లు నడిచా రు.

రామడుగు, షానగర్ సభల్లో మాట్లాడిన ఆయన.. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. 'వాన్‌పిక్' మంత్రిని వెనకేసుకు వస్తున్నారని దుయ్యబట్టారు. "వాన్‌పిక్ వ్యవహారంలో ఏ1, ఏ2, ఏ3, ఏ4, ఏ6, ఏ7ను సీబీ ఐ అరెస్టు చేసింది. ఏ5గా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావును ప్రాసిక్యూట్ చేసేందుకు వెళితే, ఆయనను అరె స్టు చేయకుండా ఈ ప్రభుత్వం అడ్డు పడింది. 26 అవినీ తి జీవోలను జారీ చేసిన మంత్రులు సుప్రీంకోర్టుకు వెళితే వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామనడం సిగ్గుచేటు''అని మండిపడ్డారు.

రైతులు మద్దతు ధర రాక ఆందోళనలు చేస్తుంటే సఎం పట్టించుకోకపోవడ తగదని విమర్శించారు. "ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నా రు. గిట్టుబాటు ధరలు దక్కక రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తికి మద్దతు ధర లేదు. ఎరువుల ధరలను నాలుగింతలు పెంచేసి ప్రభుత్వం.. రైతుల నడ్డీ విరుస్తున్న''దన్నారు.

అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గడిచిన ఏడాది వర కు 817 మంది ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి హామీ పథకంతో వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తామన్నారు. సర్‌చార్జి వసూళ్లను నిలిపి వేయాలని ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో 10 లక్షల కోట్ల అవినీతి జరగగా, రాష్ట్రంలో 86 వేల కోట్ల తో జలయజ్ఞం చేపట్టి పేదవాళ్ల సొమ్మును దోపిడీ చేశార ని దుయ్యబట్టారు. ఒకేసారి అన్ని పనులూ ప్రారంభించి మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట దోచుకున్నారని ఆరోపించారు. కిరణ్ ప్రభుత్వం దివాలా తీసిందన్నారు.

113 సెజ్‌ల పేరిట 2 లక్షల 75 వేల ఎకరాల భూములను వైఎస్ ఆయా కంపెనీలకు పంచి పెట్టారని చెప్పారు. భూగర్భ గనులు గల 8 వేల ఎకరాల భూములను ఇచ్చి 16 లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ సంపదను గాలి జనార్దన్ రెడ్డికి కట్టబెట్టారని విమర్శించారు. దేశంలో ఉన్న బంగారన్నంతా కొనేసిన గాలి బంగారు మంచం, కంచం, గ్లాసు, కుర్చీ చివరికి బంగారు మరుగుదొడ్డి ని కూడా ఏర్పాటు చే సుకున్నాడని, దానివల్ల ఆడపడుచులకు బం గారు మంగళ సూత్రం, ఆడపిల్లలకు ముక్కు పోగు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

భూగర్భ సం పదనంతా కొల్లగొట్టార ని, అదే ఉంటే వృద్ధుల కు వెయ్యి రూపాయల పింఛను, పేదలకు ఇళ్లు, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. గుండె లు గుబేల్‌మనేలా కరెంట్ బిల్లులు వస్తున్నాయని, వ్యవసాయానికి రోజుకు 4 గంటలైనా విద్యుత్తు ఇవ్వడం లేదని విమర్శించారు. టీడీపీ హయాంలో మహిళలకు 35 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు పెరిగిన ధరల వల్ల గ్యాస్ కొనే పరిస్థితి లేదన్నా రు. దేశంలో డబ్బుల్లేక కాదని, ఆ డబ్బును దోచుకుని వాళ్ల ఖజానాలు నింపుకుంటున్నారని పరోక్షంగా జగన్‌పై నిప్పులు చెరిగారు.

మార్గమధ్యలో పత్తి రైతులు, వివిధ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారితో చంద్రబాబు సంభాషించారు. కాగా, రామడుగు సభలో కొందరు యువకులు జై తెలంగాణ నినాదాలు చేయడంతో వారిని పోలీసులు పక్కకు వెళ్లగొట్టారు. చంద్రబాబు వెంట శాసన మండలి సభా పక్ష నేత దాడి వీరభద్ర రావు, టీ-టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు సుద్దాల దేవయ్య, సీహెచ్ విజయరమణారావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు.