December 22, 2012

యువత పిడికిలి బిగించాలి!

టీడీపీ హయాంలో జిల్లాలకు వెళ్లిన ప్రతిసారీ డ్వాక్రా మహిళలతో మాట్లాడించేవాడిని! వారి కష్టసుఖాలను వారితోనే చెప్పించేవాడిని! వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేవాడిని! ఆ తర్వాత డ్వాక్రా మహిళలు ఐక్యరాజ్యసమితిలోనూ ప్రసంగించారు! అప్పట్లో మహిళలు భరోసాతో తలెత్తుకుని తిరిగేవారు! మరి ఇప్పుడు!? మహిళల్లో పూర్తి అభద్రత వచ్చేసింది! ఒక్క మన రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే దుస్థితి!

దేశ రాజధానిలో యువతిపై సామూహిక అత్యాచారం ఘటన సిగ్గుచేటు. బాధాకరం. ఏం చేసినా తప్పించుకుని తిరగవచ్చనేలా చట్టాలు ఉండడమే నేరస్తులకు ఆ ధీమా ఇస్తోంది. ఇలాంటి తప్పులు చేస్తే కఠినంగా శిక్ష ఉంటుందనే భయం ఉండాలి. ఇటువంటి ఘటనలు జరిగిన వెంటనే పాలకులు సరిగా స్పందించి ఉంటే ఢిల్లీలో ఇంత దారుణం జరిగి ఉండేది కాదు. మహిళల్లోనూ ఒక నమ్మకం వచ్చి ఉండేది. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

ఈ రోజు నా యాత్రలో కిమ్స్ కాలేజీతోపాటు మరో ప్రైవేటు కాలేజీలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడాను. ఇదే అంశాన్ని వారిలో చర్చకు పెట్టాను. ఆ ఘటనపై మీరేం చేశారని ప్రశ్నించాను. ప్రభుత్వాలు స్పందించాలి. మేమేం చేయగలమన్నట్లు వారు మాట్లాడారు. ఏమీ చేయలేమనే నిస్సహాయత ఉంది కాబట్టే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఆ ఘటనకు నిరసనగా కిమ్స్ కాలేజీ విద్యార్థులతో కొవ్వొత్తుల ర్యాలీ చేయించాను. ఇలాంటి కార్యక్రమాలు మిగతా వారికి స్ఫూర్తినిచ్చి వాళ్లు కూడా నిరసనలో పాల్గొనేలా చేస్తాయని ఆశిస్తున్నాను. ప్రజలు స్పందించి రోడ్లపైకి రాకపోతే పాలకుల్లో బాధ్యతారాహిత్యం పెరిగిపోతుంది.

ఢిల్లీలో యువతరం ఉద్యమించడం శుభ పరిణామం. ఏం జరిగినా నాకు సంబంధం లేదు కదా అని అనుకోవద్దు. యువత పిడికిలెత్తాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. ఇలాంటి ఉద్యమాలు మరిన్ని రావాలి. అప్పుడే ప్రభుత్వాలకు భయం ఉంటుంది. నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తారు.
No comments :

No comments :